నా డివిజన్​లోనూ తీస్తలే

నా డివిజన్​లోనూ తీస్తలే
  • చెత్తను చూసి సిగ్గుపడుతున్న
  • నా డివిజన్​లోనూ తీస్తలే.. జీహెచ్‌‌‌‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి
  • నా ఇంటి దగ్గరికే స్వచ్ఛ ఆటో వస్తలే: మాజీ మేయర్​ మాజిద్
  • రాంకీ సంస్థ నిర్లక్ష్యంతోనే చెత్త సమస్య: బీజేపీ కార్పొరేటర్లు
  • -విమోచన, సమైక్యతా దినోత్సవాలపై బీజేపీ, టీఆర్ఎస్ మధ్య గొడవ
  • పార్టీల ఫిరాయింపులపై సభలో రచ్చ.. పోడియం వద్దకు విజయారెడ్డి
  • పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ రోడ్డుపై కాంట్రాక్టర్ల ఆందోళన

హైదరాబాద్, వెలుగు: సిటీలో చెత్తను చూసి సిగ్గు పడుతున్నానని జీహెచ్‌‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి అన్నారు. తన డివిజన్‌‌లోనూ ఇదే పరిస్థితి ఉందని, చెత్తను ఎత్తడం లేదని చెప్పారు. మంగళవారం జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరిగింది. గ్రేటర్ హైదరాబాద్‌‌లో చెత్త నిర్వహణ విషయంలో ఆఫీసర్ల తీరుపై అధికార పార్టీ కార్పొరేటర్లే ఫైర్ అయ్యారు. స్వచ్ఛ ఆటోలు ఎక్కడకు వస్తున్నాయో తెలియడంలేదని, తన ఇంటి దగ్గరికే స్వచ్ఛ ఆటో రావడం లేదని మాజీ మేయర్ మాజిద్ హుస్సేన్ మండిపడ్డారు. శానిటేషన్‌‌పై అధికారులు ఇచ్చిన సమాధానాలు తనకే అర్థం కాలేదని, ప్రజలకు ఇంకేం అర్థమవుతుందని మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ విమర్శించారు. రాంకీ సంస్థ నిర్లక్ష్యంతోనే చెత్త సమస్య ఏర్పడుతున్నదని బీజేపీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో స్పందించిన మేయర్.. గ్రేటర్‌‌‌‌లో చెత్త సమస్య లేకుండా అన్ని పార్టీలతో కలిసి ప్రాంతాల వారీగా యాక్షన్ ప్లాన్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు పార్టీ ఫిరాయింపులు.. ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేయకపోవడం.. విమోచన, సమైక్యతా ఉత్సవాలపై కౌన్సిల్‌‌లో మాటల యుద్ధం నడిచింది.

టులెట్ బోర్డులపై ఫైన్లా?

నాలాల నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో చిన్నవర్షాలకే కాలనీలు మునుగుతున్నాయని అన్ని పార్టీల సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. సిటీలో టులెట్ బోర్డులు పెడితే ఫైన్లు వేస్తున్నారంటూ ఈవీడీఎం డైరెక్టర్‌‌‌‌పై కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. ఇండ్ల వద్ద టులెట్ బోర్డులు పెడితే ఫైన్లు వేయబోమని, పబ్లిక్ ప్లేస్‌‌లో పెడితే చట్ట ప్రకారం ఫైన్లు విధిస్తామని డైరెక్టర్ విశ్వజిత్ స్పష్టం చేశారు. అధికార పార్టీ ప్లీనరీలు ఉన్న ప్రతిసారి ఎందుకు సెలవుపై వెళ్తున్నారని కార్పొరేటర్ మధుసూదన్ రెడ్డి ప్రశ్నించగా.. అది తన వ్యక్తిగత విషయమని విశ్వజిత్ సమాధానం ఇచ్చారు.

మేయర్‌‌‌‌తో విజయారెడ్డి వాగ్వాదం

ముగ్గురు బీజేపీ కార్పొరేటర్లు ఇటీవల టీఆర్ఎస్‌‌లో చేరగా.. సభలో వారికి మన్నె కవితారెడ్డి వెల్ కమ్ చెప్పారు. దీంతో కాసేపు గందరగోళం నెలకొంది. సీఎం కేసీఆర్ ఎంత ఇచ్చి తమ కార్పొరేటర్లను కొనుగోలు చేశారో చెప్పాలని బీజేపీ కార్పొరేటర్లు ఆందోళన చేశారు. ఇదే సమయంలో తమ పార్టీ నుంచి కూడా వేరే పార్టీలోకి వెళ్లారని ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డిని ఉద్దేశించి మేయర్ అన్నారు. దీంతో విజయారెడ్డి పోడియం వద్ద మేయర్‌‌‌‌తో వాగ్వాదానికి దిగారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలను వసూలు చేయడం లేదని అధికారులపై బీజేపీ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. రూ.3 వేల కోట్ల బకాయిలు ఉండగా ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. 

అడ్డగోలు అనుమతుల వల్లే అగ్ని ప్రమాదాలు

బోయగూడ, రాణిగంజ్, సికింద్రాబాద్‌‌లో జరిగిన అగ్నిప్రమాదాలకు అధికారులే బాధ్యత వహించాలని బీజేపీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యంతోనే అమాయక ప్రజలు చనిపోతున్నారన్నారు. తనిఖీలు చేయకుండా అడ్డగోలుగా పర్మిషన్స్ ఇస్తున్నందుకే ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. మరోవైపు, పెండింగ్‌‌లో ఉన్న రూ.800 కోట్ల బకాయిలను చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసు వద్ద ఉదయం 9 గంటలకు ఆందోళనకు దిగారు. తర్వాత ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం వరకు వెళ్లి నిరసన చేశారు.  పోలీసులు కాంట్రాక్టర్లను అదుపులోకి తీసుకొని, రాంగోపాల్‌‌పేట్‌‌కి తరలించారు. కౌన్సిల్ సమావేశం పూర్తయిన తర్వాత వదిలిపెట్టారు.

జాతీయ సమైక్యత.. కాదు విమోచనం..

రాష్ట్ర ప్రభుత్వ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ స్వాతంత్ర్య సమర యోధులకు కౌన్సిల్ సమావేశంలో నివాళుల ర్పించారు. ఇదే సమయంలో అడ్డుకున్న బీజేపీ కార్పొరేటర్లు.. ‘తెలంగాణ విమోచన దినోత్సవం’ అంటూ నినదించారు. ఎంఐఎం పార్టీకి భయపడి రాష్ట్ర ప్రభుత్వం జాతీయ సమైక్యత అంటున్నదని మండిపడ్డారు. జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ టీఆర్ఎస్ సభ్యులు స్లోగన్స్ ఇవ్వగా.. భారత్ మాతాకీ జై అంటూ బీజేపీ కార్పొరేటర్లు నినాదాలు చేశారు.