- ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్న జనం
- ఫ్లైఓవర్ల నిర్మాణంపై జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్‌లోని రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల ప్రాజెక్టు నిర్మాణాన్ని జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చేస్తోంది. ఏళ్లుగా ఈ రూట్ లో ప్రయాణించే వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదు. సరోజినీదేవి కంటి దవాఖాన నుంచి రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల వరకు వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతుండగా, మరోవైపు నానల్‌నగర్ నుంచి టోలిచౌకి, లంగర్‌హౌస్ వైపు ఫ్లోర్‌మిల్ వరకు ట్రాఫిక్ జామ్ అవుతోంది.
ఉదయం ఆఫీసులకు వెళ్లే సమయం నుంచి రాత్రి వరకు ఈ రూట్ లో వాహనదారులు నరకం చూస్తున్నారు. కీలకమైన ఈ జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ఫ్లైఓవర్ల నిర్మాణం ఎంతో అవసరమని తెలిసినా జీహెచ్‌ఎంసీ పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వికారాబాద్, చేవెళ్ల, శంకర్‌పల్లి, గచ్చిబౌలి వైపు వెళ్లేవారితోపాటు అత్తాపూర్, లంగర్‌హౌస్, టోలిచౌకి, మెహిదీపట్నం ప్రాంతాలకు వెళ్లేవారు రేతిబౌలి, నానల్‌నగర్ జంక్షన్ల మీదుగానే రాకపోకలు సాగిస్తుంటారు.
అలాగే, గచ్చిబౌలి, హైటెక్ సిటీ వెళ్లేవారితోపాటు లింగంపల్లి, పఠాన్ చెరువు వెళ్లేవారు ఈ జంక్షన్ల మీదుగానే వెళ్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు కూడా ఇటునుంచే వెళ్తాయి. ఐసీసీసీ నుంచి పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే వరకు హెచ్ఎండీఏ నిర్మించనున్న ఫ్లైఓవర్ కారణంగా రేతిబౌలి, నానల్ నగర్ జంక్షన్ల ప్రాజెక్టును రద్దు చేస్తారన్న చర్చ జరుగుతోంది.
ఇదీ ప్రాజెక్ట్ డిజైన్..
సరోజినీదేవి ఐ హాస్పిటల్ముందు నుంచి ఆరాంఘర్ వరకు ఉన్న పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వేకు సమానంగా మల్టీలెవల్ ఫ్లైఓవర్, గ్రేడ్ సపరేటర్లను నిర్మించాల్సి ఉంది. మెహిదీపట్నం బసంతర్ హౌస్‌లోని ఆర్మీ స్థలంలో ఉన్న జలమండలి ఫిల్టర్ బెడ్ నుంచి పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వేకు సమాంతరంగా ఫ్లైఓవర్ ను నిర్మిస్తూ రేతిబౌలి జంక్షన్ లో అత్తాపూర్ వైపు ఓ ర్యాంప్, రేతిబౌలి సిగ్నల్ నుంచి నానల్ నగర్ జంక్షన్ మీదుగా ఈ ఫ్లైఓవర్ ను టోలీచౌకి ఫ్లై ఓవర్ కు కనెక్టివిటీగా నిర్మించాలి.
నానల్ నగర్ జంక్షన్ నుంచి ఎడమవైపు లంగర్ హౌస్‌వైపు వెళ్లే వాహనాలకు నానల్ నగర్ జంక్షన్ కు ఎడమ వైపు ఉన్న ఆలివ్ హాస్పిటల్ వరకు ఓ ర్యాంప్ నిర్మించాల్సి ఉంది. ఈ ఫ్లైఓవర్ అటు టోలిచౌకి వైపు, అత్తాపూర్, లంగర్ హౌస్‌ల వైపు వాహనాలు వెళ్లేందుకు తిరిగి వచ్చేందుకు అనుకూలంగా ఉండేలా రెండు లేన్లుగా ఏర్పాటు చేయాల్సి ఉంది.
టెండర్లు వేసి ఏడాది..
నానల్నగర్, రేతిబౌలి రూట్లో సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రతిపాదించిన మల్టీలెవల్ ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేటర్లను రూ.398 కోట్లతో నిర్మించాలని జీహెచ్ఎంసీ ప్రతిపాదించింది. ఏడాది కింద టెండర్లు కూడా పూర్తి చేసింది. అయినా పనులు స్టార్ట్ చేయలేదు. దీంతో మెహిదీపట్నం, సరోజినీదేవి కంటి దవాఖాన, రైతుబజార్ పరిసరాల్లో ట్రాఫిక్కారణంగా వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ప్రయాణికులు నానాతంటాలు పడుతున్నారు.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హెచ్-సిటీ ప్రాజెక్టులో భాగంగా పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేకు సమాంతరంగా ఫ్లైఓవర్ నిర్మించాలని అనుకున్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పనులు జరగడం లేదన్న ఆరోపణలున్నాయి.
