- సొంతంగా ఏర్పాటు చేసుకునేందుకు సీఎంసీ, ఎంఎంసీ చర్యలు
హైదరాబాద్ సిటీ, వెలుగు: నగరంలో స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. మూడు కార్పొరేషన్ల స్ట్రీట్ లైట్ల నిర్వహణ టెండర్లు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పూర్తి కావాల్సి ఉన్నా అధికారుల నిర్లక్ష్యంతో ఆలస్యమవుతున్నది. టెండర్లు వేసి ఏజెన్సీలను ఫైనల్ చేయాలని ఈ ఏడాది మార్చి 6న ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. అయినా, ఇప్పటికీ ఈ అంశంపై క్లారిటీ రావడంలేదు.
ఏం చేద్దామనే దానిపై పలువురు జోనల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో కలిసి ఓ కమిటీ వేసిన ప్రయోజనం లేకుండాపోయింది. దీంతో మెయిన్రోడ్లు, కాలనీలు, ఇంటర్నల్రోడ్లలో స్ట్రీట్ లైట్లు పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరో పది రోజుల్లో వర్షాలు కూడా పడే అవకాశం ఉండడంతో రోడ్లపై గుంతలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి. రాను రాను టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో సీఎంసీ, ఎంఎంసీలు సొంత నిధులతో టెంపరరీగా స్ట్రీట్ లైట్ల ఏర్పాటు చేసుకుంటూ అవసరమైనచోట రిపేర్లు చేసుకుంటున్నాయి.
3 కార్పొరేషన్లలో 7 లక్షల లైట్లు
మూడు కార్పొరేషన్ల పరిధిలో 7,60,591 స్ట్రీట్ లైట్లున్నాయి. జీహెచ్ఎంసీలో 3,30,487, సీఎంసీలో 1,85,258, ఎంఎంసీలో 2,44,846 ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్ కోసం రూ.1341కోట్లతో టెండర్ల ప్రక్రియ నిర్వహించి జీహెచ్ఎంసీని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో గతంలో ఉన్న విధానానికి కాస్త భిన్నమైన పద్ధతిని అనుసరించాలని ఈ సారి జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. ఢిల్లీ తరహాలో కేవలం వెలిగే లైట్లకు మాత్రమే మెయింటెనెన్స్ చార్జీలను చెల్లించాలని అనుకోగా, టెండర్ల ప్రక్రియ ఆలస్యమవుతున్నది.
30 శాతం వెలగట్లే..
స్ట్రీట్లైట్ల నిర్వహణ లేకపోవడంతో ప్రస్తుతం 20 నుంచి 30 శాతం లైట్లు వెలగడం లేదు. టైమర్లు పనిచేయక కొన్నిచోట్ల 24 గంటలు వెలుగుతుండగా, ఇంకొన్ని చోట్ల రాత్రి వెలగడంలేదు. దీంతో సాయంత్రం ఆరు దాటితే చాలాచోట్ల మెయిన్రోడ్లు మొదలుకొని కాలనీలు, బస్తీలు చీకట్లో మగ్గుతున్నాయి. ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్లైట్లది కూడా ఇదే పరిస్థితి. లైట్లు ఏర్పాటు చేయాలని ట్రాఫిక్ పోలీసులు జీహెచ్ఎంసీని కోరుతున్న పట్టించుకోవడం లేదు.
