ఫేక్‌‌ ఫింగర్‌‌ ప్రింట్‌‌ దొంగలెక్కడ ?

ఫేక్‌‌ ఫింగర్‌‌ ప్రింట్‌‌ దొంగలెక్కడ ?
  • అటకెక్కిన నకిలీ వేలి ముద్రల కేసు
  • వరుస తనిఖీలు చేస్తామని చెప్పి కాలయాపన
  • ఆరునెలలు దాటినా కొలిక్కిరాకపోవడంతో అనుమానాలు
  • అక్రమార్కులకు  పెద్దలు సహకరించడమే  కారణమా ..!
  • లక్షలాది రూపాయల ప్రజాధనం స్వాహా
  • ఇంటిదొంగల భరతం పట్టని బల్దియా

న‌‌కిలీ ఫింగ‌‌ర్ ప్రింట్స్ కుంభకోణం కేసును బల్దియా అటకెక్కించింది. అక్రమార్కులకు సహకరించిన అధికారులెవరో..? తేల్చాల్సి ఉన్నా ఇప్పటివరకు చేసిందేమీ లేదు. సిటీలో పారిశుద్ధ్య కార్మికుల నకిలీ వేలి ముద్రలు తయారు చేసి, తప్పుడు హాజరు చూపించి, పెద్దమొత్తంలో నిధుల కాజేసిన అధికారులు, సిబ్బందిపై లోతుగా విచారణ చేయడం లేదు.  ప్రజా ధనాన్ని పక్కదారి పట్టించిన  ఇంటి దొంగలపై  జీహెచ్‌‌ఎంసీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. విజిలెన్స్‌‌ దాడుల్లో పట్టుబడినా… ఎవరెవరి పాత్ర ఉందో తేలుస్తామని  చెప్పి ఆరు నెలలు గడిచినా కేసు ఫురోగతిలో అడుగు కూడా ముందుకు పడలేదు.

హైదరాబాద్‌‌, వెలుగు: మహానగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పే బల్దియా అధికారులు ఇంటిదొంగలను మాత్రం పట్టించుకోవడం లేదు. స్వచ్ఛత నిబంధనలు పాటించాలని పౌరులకు సందేశాలిచ్చే పెద్దలు ప్రజాధనాన్ని స్వాహా చేసే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవడం లేదు.  పారిశుధ్య కార్మికుల నకిలీ వేలి ముద్రలు తయారు చేసి, తప్పుడు హాజరు చూపించి, పెద్దమొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన అధికారులు, సిబ్బందిపై లోతైన విచారణ జరపడం లేదు. దాడుల్లో పట్టుబడిన వారిపై మొక్కుబడి చర్యలు తీసుకుని చేతులు దులుపుకున్నారు. ఆరు నెలలు గడిచిపోయినా కేసు దర్యాప్తు అడుగు కూడా ముందుకు పడలేదు.

84 కృత్రిమ సింథటిక్ ఫింగర్ ప్రింట్లు స్వాధీనం

జీహెచ్‌‌ఎంసీ ఇంటిదొంగల చేతివాటం జనవరిలో బహిర్గతమైంది. డూప్లికేట్‌‌ ఫింగర్‌‌ ప్రింట్లతో బయోమెట్రిక్‌‌ అటెండెన్స్‌‌ వేస్తూ లక్షల్లో నొక్కేస్తున్న వ్యవహారం విజిలెన్స్‌‌, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్‌‌ దాడులతో బయటపడింది. న‌‌గ‌‌రంలోని 12 ప్రాంతాల్లో శానిట‌‌రీ ఫీల్డ్ అసిస్టెంట్లపై ఆక‌‌స్మిక త‌‌నిఖీలు నిర్వహించాయి. త‌‌నిఖీల్లో 84 కృత్రిమ వేలిముద్రలు స్వాధీనం చేసుకున్నారు. జీహెచ్ఎంసీ విజిలెన్స్‌‌, ఎన్‌‌ఫోర్స్‌‌మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి నేతృత్వంలో ఆరు బృందాలు చార్మినార్‌‌, మ‌‌ల‌‌క్‌‌పేట్‌‌, కూక‌‌ట్‌‌ప‌‌ల్లి, ఎల్బీన‌‌గ‌‌ర్‌‌, బాలాన‌‌గ‌‌ర్‌‌, జ‌‌గ‌‌ద్గిరి గుట్టలో 12 ప్రాంతాల్లో త‌‌నిఖీలు నిర్వహించాయి. దాడుల్లో 84 కృత్రిమ సింథటిక్ ఫింగ‌‌ర్ ప్రింట్‌‌ల‌‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 17 మంది ఎస్‌‌ఎఫ్‌‌ఏల‌‌ను విచారించ‌‌గా 9 మంది వ‌‌ద్ద ఈ న‌‌కిలీ ఫింగ‌‌ర్ ప్రింట్స్‌‌ను గుర్తించారు. నగరంలో చాలా చోట్ల ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని, ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉందని ఆరోపణలు వినిపించాయి. కార్మికుల తప్పుడు హాజరు చూపించడంతో పాటు కార్మికులు లేకపోయినా ఉన్నట్టుగా చూపి జీతాలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

నెలకు రూ.12.18 లక్షలు హాంఫట్

సిటీలో పారిశుధ్య కార్మికులకు రూ.14,500 జీతం ఇస్తున్నారు. 84 కృత్రిమ ఫింగర్‌‌ ప్రింట్లు అంటే నెలకు రూ.12.18 లక్షలు నొక్కేసినట్టు స్పష్టమైంది.  దాడులు చేసిన ప్రాంతాల్లోనే ఇలా ఉంటే సిటీ మొత్తంలో ఎంత భారీ కుంభకోణం జరిగి ఉంటుందో అంచనా వేయవచ్చు. 9 మంది ఎస్‌‌ఎఫ్‌‌ఏలు న‌‌కిలీ ఫింగ‌‌ర్ ప్రింట్స్ రూపొందించిన‌‌ట్టు గుర్తించారు. యూ ట్యూబ్‌‌లో చూసి వీటిని త‌‌యారు చేసినట్టు విచారణలో తేలడంతో వారిని విధుల నుంచి తొల‌‌గించి చేతులు దులుపుకున్నారు.

బల్దియాలో 22 వేల మంది పారిశుధ్య కార్మికులు

జీహెచ్ఎంసీలో మొత్తం 22 వేల మంది పారిశుధ్య కార్మికులున్నారు. 2017 ఫిబ్రవరిలో బయోమెట్రిక్‌‌ను ప్రారంభించారు.  శానిటరీ సిబ్బందికి బయోమెట్రిక్‌‌ హాజరు ప్రవేశపెట్టిన దేశంలో తొలి కార్పొరేషన్‌‌గా జీహెచ్‌‌ఎంసీ గుర్తింపు పొందింది. ఇక్కడే అక్రమార్కులు తమ తెలివితేటలు చూపారు. బయోమెట్రిక్‌‌ పరిజ్ఞానాన్ని కూడా అపహాస్యం చేస్తూ నకిలీ ఫింగర్‌‌ ప్రింట్లను తయారు చేశారు. సిటీలో మొత్తం శానిటేష‌‌న్   939, ఎంట‌‌మాల‌‌జీ సిబ్బందికి 132 బ‌‌యోమెట్రిక్ మిషన్లను కేటాయించారు. ఆ మిష‌‌న్లలో కార్మికుల వేలిముద్రలు, ఆధార్ వివ‌‌రాలు పొందుప‌‌రిచారు. ఎస్‌‌ఎఫ్‌‌ఏల‌‌కు అనుసంధానం చేశారు. కార్మికుల హాజ‌‌రును సంబంధిత ఎస్ఎఫ్ఏలు సేకరిస్తున్నారు. ఒక ప్రాంతంలోని బ‌‌యోమెట్రిక్ మిష‌‌న్ ఇత‌‌ర ప్రాంతంలో ప‌‌నిచేయ‌‌దు. పకడ్బందీ ఏర్పాట్లు ఉన్నా ఎస్ఎఫ్ఏలే తమ చాతుర్యాన్ని ప్రదర్శించి లక్షలాది రూపాయల ప్రభుత్వ ఆదాయాన్ని కొల్లగొట్టారు. ఈ కేసులో వెనుక ఉన్న పెద్దల ప్రమేయాన్ని గుర్తిస్తామని చెప్పినా నేటి వరకూ కేసు పురోగతి లేదు.