
కూకట్పల్లి, వెలుగు: ఫతేనగర్‌లో నాలాలో బాలుడు కొట్టకుపోయి మృతి చెందిన ఘటనకు జీహెచ్ఎంసీ అధికారులదే బాధ్యత అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలుడు కొట్టుకుపోయిన నాలాను ఆదివారం ఆయన పరిశీలించారు. నాలాకు రిటైనింగ్ వాల్ కట్టాలని అనేకసార్లు తాను జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు వినతిపత్రాలు ఇచ్చానని తెలిపారు. అధికారులు స్పందించకపోవటం వల్లే బాలుడు చనిపోయాడన్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం ఆయన బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఆయనతో పాటు స్థానిక కార్పొరేటర్ సతీశ్‌గౌడ్ ఉన్నారు.