213 నోటీసుల పేరుతో సెటిల్ మెంట్లు ..‘జీఐఎస్ ’తో బయటపడుతున్న బాగోతం

213 నోటీసుల పేరుతో సెటిల్ మెంట్లు ..‘జీఐఎస్ ’తో బయటపడుతున్న బాగోతం
  •  సిబ్బంది, అధికారులు కలిసి బల్దియా ఆదాయానికి గండి
  • 213 నోటీసుల పేరుతో సెటిల్ మెంట్లు  
  • 19.50 లక్షల ప్రాపర్టీలకు మాత్రమే ఆస్తిపన్ను వసూలు
  • జీఐఎస్ సర్వేతో 25 లక్షల వరకు ఉన్నట్టు గుర్తింపు

 హైదరాబాద్ సిటీ, వెలుగు: జీఐఎస్(జియో ఇన్ఫర్ మేషన్ సిస్టం)తో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది బాగోతాలు ఒక్కక్కొటిగా బయటపడుతున్నాయి. ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్, ట్రేడ్ లైసెన్స్ ల విషయంలో ఇన్నాళ్లూ వారు ఆడింది ఆట, పాడింది పాటగా సాగింది.​ గ్రేటర్ లో ఉన్నతాధికారులకు తెలియకుండా సర్కిల్ స్థాయిలోనే ప్రాపర్టీ ట్యాక్స్ లు, ట్రేడ్ లైసెన్సు ల సెటిల్ మెంట్ల దందాను యథేచ్ఛగా కొనసాగించారు. ఏండ్లుగా బల్దియా నుంచి రూ. కోట్లు కొల్లగొట్టారు. పైగా తామే ఆదాయాన్ని తీసుకువచ్చి నడుపుతున్నట్లు చెప్పుకున్నారు. అయితే, జీఐఎస్​సర్వే తర్వాత నిజాలన్నీ బయటకు వస్తున్నాయి.

గ్రేటర్​లో ఇప్పటివరకు 19.50 లక్షల ప్రాపర్టీల నుంచి ఆస్తి పన్ను కలెక్ట్​చేయగా, 70 శాతం సర్వే తర్వాత ఈ సంఖ్య 25 లక్షలకు చేరుకుంది. ఇన్నాళ్లూ దాదాపు 6 లక్షల ఆస్తుల నుంచి పన్ను వసూలు కాలేదని తేలింది. ఇందులో కమర్షియల్ తో పాటు రెసిడెన్షియల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. ఈ విషయం తెలిసిన కమిషనర్​సీరియస్ గా ఉన్నారు. కొత్తపేటలోని శ్రీలక్ష్మి వైట్ హౌస్ షాపింగ్​మాల్ లో 450 దుకాణాలుండగా, 200 షాపులు కొనసాగుతున్నాయి. అయితే, వీటిలో 50 వరకు మాత్రమే అసెస్ మెంట్లు చేసినట్లు తెలిసింది. మిగతా వాటికి అసెస్ మెంట్లు ఎందుకు చేయడం లేదన్నది చర్చనీయాంశమైంది. ఇలాగే గ్రేటర్​లో చాలా చోట్ల బల్దియాకు వచ్చే ఆదాయాన్ని నొక్కేస్తున్నారని తెలిసింది. 

జీఐఎస్​ సర్వే ఇలా..

గ్రేటర్​లో ఎన్ని ప్రాపర్టీలు ఉన్నాయో గుర్తించేందుకు జీఐఎస్ సర్వే మొదలుపెట్టారు. సర్వేలో భాగంగా డ్రోన్లతో పాటు సిబ్బంది ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇది ఇప్పటికే దాదాపు 70 శాతం పూర్తయ్యింది. ఇప్పటివరకు పూర్తయిన సర్వేలో ఆస్తి పన్ను వసూలవుతున్న 19.50 లక్షల ప్రాపర్టీలే కాకుండా మరో ఆరు లక్షల వరకు ఆస్తులు ఉన్నాయని తేలింది. వీటి నుంచి ఆస్తి పన్ను వసూలు చేయడం లేదని గుర్తించారు. ఒకచోట నాలుగు ఫ్లోర్ల బిల్డింగు ఉండగా, రెండు ఫ్లోర్లకు మాత్రమే ట్యాక్స్ కడుతున్నట్లు తెలిసింది. అలాగే కమర్షియల్ భవనాలకు కూడా రెసిడెన్షిషల్ గా పన్నులు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. 

ప్రాపర్టీ ట్యాక్స్​ను రివైజ్ చేయకుండా

కొందరు అధికారులు, సిబ్బందికి 213 నోటీసు ఆదాయ వనరుగా మారింది. రెసిడెన్షియల్​బిల్డింగుల్లో కమర్షియల్ యాక్టివిటీస్ చేస్తే సంబంధిత భవనాలకు బిల్ కలెక్టర్లు 213 నోటీసులు జారీ చేయాల్సి ఉంటుంది. నోటీసిచ్చిన ఏడు రోజుల్లోపు సంబంధిత ఓనర్ రెసిడెన్షియల్ అని సంబంధిత డాక్యుమెంట్లు సమర్పించి తేల్చుకోవాల్సి ఉంటుంది. వారం తర్వాత కూడా స్పందించకపోతే దాన్ని కమర్షియల్ గా గుర్తించి ప్రాపర్టీ ట్యాక్స్ ని పెంచి వసూలు చేస్తారు. 6 నెలల క్రితం 213 నోటీసులకు బదులుగా ఇంటి యజమానులే నేరుగా సెల్ఫ్ అసెస్ మెంట్ చేసుకునేవారు.

213 నోటీసులిస్తున్న తర్వాత నేరుగా బిల్ కలెక్టర్లు రంగంలోకి దిగుతున్నారు. ఈ చర్య ఆదాయం పెంచేందుకు ఉపయోగపడేదే అయినా కొందరు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు. సంబంధిత ప్రాపర్టీదారులతో సెటిల్ మెంట్లు చేసుకొని ప్రాపర్టీ ట్యాక్స్​ను రివైజ్ చేయకుండా రెసిడెన్షియల్​గానే కొనసాగిస్తున్నారు. బల్దియాకు ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇక ఆస్తి పన్ను బకాయి ఉంటే డిమాండ్ నోటీసు ఇచ్చి ఎంతో కొంత తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. 

సెక్షన్ 213 అంటే? 

 ట్యాక్స్ కలెక్షన్ విధానంలో ఆస్తులను అసెస్ మెంట్ చేసి ప్రాపర్టీ ట్యాక్స్ పరిధిలోకి తీసుకురావటం, వార్షిక పన్ను విధించి ఏటా కలెక్షన్ చేసే సిస్టమ్ ఇదివరకు ఉండేది. ఈ పాత విధానంతో ట్యాక్స్  భవన యజమాని ప్రతి సంవత్సరం ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించారా? లేదా? అని ప్రశ్నించటం వరకే ట్యాక్స్ స్టాఫ్ కు అధికారముంది. 1959 మున్సిపల్ యాక్ట్ లోని సెక్షన్ 213 సెక్షన్ ప్రకారం  ట్యాక్స్ సిబ్బంది ఆయా ఆస్తుల యజమానుల వద్దకు  నేరుగా వెళ్లి, భవన నిర్మాణ అనుమతి ప్రతి, నిర్మాణంలో డీవీయేషన్స్, అక్యుపెన్సీ సర్టిఫికెట్ తో పాటు యూసేజీకి సంబంధించిన అన్ని పత్రాలను తనిఖీ చేసు అధికారం ఉంది.

ఒక వేళ రెసిడెన్షియల్ నిర్మించి కమర్షియల్ గా వినియోగిస్తున్నట్లయితే, అలాంటి ప్రాపర్టీలకు వంద శాతం ట్యాక్స్ ను పెంచే అధికారం ఉంది. అయితే దీన్ని ఆస్తిపన్ను వసూలు కంటే లాభం కోసమే అధికారులు, సిబ్బంది  ఎక్కువగా వాడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.