యూనియన్ ఆఫీసులను ఖాళీ చేయించేందుకు ప్లాన్

యూనియన్ ఆఫీసులను ఖాళీ చేయించేందుకు ప్లాన్

హైదరాబాద్​, వెలుగు: జీహెచ్ఎంసీ బిల్డింగ్​లో కార్మిక సంఘాల ఆఫీసులను ఖాళీ చేయించేందుకు మరోసారి బల్దియా అధికారులు ప్లాన్​ చేస్తున్నారు. గతంలోనూ ఇదే విషయంపై యూనియన్లకు నోటీసులు ఇచ్చినప్పటికీ తర్వాత ఈ నిర్ణయంపై అధికారులు వెనక్కి తగ్గారు. గతంలో మాదిరిగానే మళ్లీ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం పేరుతో వాటిని ఖాళీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందా? లేక ఇక్కడి నుంచి యూనియన్ ఆఫీసులను ఖాళీ చేయించడానికే అధికారులు ప్లాన్ చేస్తున్నారా అనేదానిపై సందేహాలు నెలకొన్నాయి. ఒకవేళ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణమే కారణమైతే అందుకు సంబంధించిన ప్లానింగ్​కు అధికారులు సిద్ధం చేసేవారు. కానీ ఇప్పటివరకు అలాంటి పనులేవీ చేయలేదు. మరోవైపు కొత్తగా పుట్టుకొస్తున్న యూనియన్లకు బల్దియా హెడ్డాఫీసులో అధికారులు రూమ్స్ కేటాయించడం లేదు. రూమ్స్ ఖాళీగా ఉన్నప్పటికీ లేవని చెప్తున్నారు.హెడ్డాఫీసులో ఏ రూమ్ అయినా ఖాళీగా ఉంటే దాన్ని ఏదో శాఖ కోసం వాడుకోవాలని ఉన్నతాధికారులు స్టాప్​కు ఆదేశాలు ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం  గుర్తింపు సంఘం మినహా యూనియన్లకు  ఖాళీ చేయాలంటూ మరోసారి నోటీసులు ఇచ్చేందుకు బల్దియా అధికారులు సిద్ధమైనట్లు సమాచారం. 

కార్మికులకు ఇబ్బందులు..

జీహెచ్ఎంసీ హెడ్డాఫీసు గ్రౌండ్ ఫ్లోర్​తో పాటు కమిషనర్ ఎంట్రీ గేటు ముందు భాగంలో 45 వరకు షెట్టర్లు, రూమ్స్ ఉన్నాయి. వీటిలో కొన్నింటిని జీహెచ్ఎంసీ అవసరాలకు వాడుకుంటోంది. మిగతా వాటిని యూనియన్ నేతలకు గతంలోనే అప్పగించింది. ఇప్పుడు  వాటిని తిరిగి తీసుకునేందుకు బల్దియా ప్లాన్ చేస్తోంది. గతంలో మాదిరిగానే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.  ఎట్టి పరిస్థితుల్లోనూ ఖాళీ చేసేది లేదని.. ఆఫీసులు ఇక్కడ ఉంటేనే కార్మికుల ఇబ్బందులు తమ  దృష్టికి వస్తాయని యూనియన్ లీడర్లు అంటున్నారు. ఇక్కడి నుంచి ఆఫీసులను ఖాళీ చేయిస్తే కార్మికులకు ఇబ్బందిగా మారుతుందంటున్నారు. 

వాడుకలో లేని స్పెషల్ ఛాంబర్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టైమ్​లోనే  జీహెచ్ఎంసీ ఆఫీసులోని మూడో ఫ్లోర్​లో మంత్రి శ్రీనివాస్​ గౌడ్​కు స్పెషల్ ఛాంబర్ ఉంది.  అప్పట్లో ఆయన ఉద్యోగ సంఘం లీడర్​గా ఉండటంతో ఈ ఛాంబర్​ని కేటాయించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి ఆయన ఈ ఛాంబర్​కు రావడం లేదు. అయినప్పటికీ ఈ ఛాంబర్​ను ఆయన పేరుతో ఖాళీగానే ఉంచుతున్నారు. దాన్ని ఇతరులకు కేటాయించేందుకు అధికారులు భయపడుతున్నారు. ఆ ఛాంబర్​ను తీసుకునేందుకు కూడా ఏ అధికారి ముందుకు రావడంలేదు. ఇటీవల బిల్డింగ్ రెనోవేషన్ కారణంగా స్పేస్​ లేకపోవడంతో కొందరు అధికారులు, సిబ్బంది ఇరుకుగా కూర్చోని పనిచేశారు. బల్దియా హెడ్డాఫీసులో కరోనా వ్యాప్తి పెరగడానికి ఇది కూడా ఓ కారణమనే విమర్శలు వచ్చాయి.  కరోనా టైమ్​లోనూ ఈ ఛాంబర్ వైపు ఎవరూ వెళ్లలేదని సమాచారం. ఇలాంటి పరిస్థితుల్లో కార్మిక సంఘాలకు ఇచ్చిన షెట్టర్లు, రూమ్స్​ను బల్దియా వెనక్కి తీసుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. మరోవైపు రెనోవేషన్ పేరుతో కొందరు అధికారులు తమ ఛాంబర్లను అందంగా తయారు చేయించుకుంటున్నట్లు సమాచారం.