
వరుస ఎన్నికల నేపథ్యంలో నిలిచిపోయిన ప్రజావాణి కార్యక్రమం 10వ తేదీ సోమవారం నుంచి తిరిగి ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగే ప్రజావాణి కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్లు, చీఫ్ సిటీ ప్లానర్, పన్నుల విభాగం అధికారులు, ఫోర్స్ మెంట్ డైరెక్టర్ పాల్గొనాలని కమిషనర్ దాన కిశోర్ ఆదేశించారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే ప్రజావాణి కార్యక్రమంలో పౌరుల నుంచి విజ్ఞాపనలు స్వీకరించి తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. అధికారులు ఎవరైనా హాజరు కాలేని పక్షంలో తన నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. జోనల్, సర్కిల్ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్ స్వీకరణ తప్పనిసరిగా చేపట్టాలని స్పష్టం చేశారు. మొదటి, రెండో శని వారాల్లో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా గ్రీవెన్స్ పరిష్కారంపై దృష్టి పెడతానని వెల్లడించారు. సోమవారం ఎట్టి పరిస్థితుల్లోనూ సిబ్బందికి క్యాజువల్ లీవ్ ఇవ్వొద్దని ఉన్నతాధికారులను ఆదేశించారు. వరుస ఎన్నికల నేపథ్యంలో సుమారు ఆరు నెలల నుంచి గ్రీవెన్స్ కార్యక్రమం సక్రమంగా జరగడం లేదు. ప్రస్తుతం ఎన్నికలు అన్ని పూర్తయిన నేపథ్యంలో ఇకపై ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని జిహెచ్ఎంసి నిర్ణయించింది. .