- చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు
హైదరాబాద్ సిటీ, వెలుగు : జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలోని పటేల్‌నగర్, అంబర్‌పేట్‌లోని యానిమల్ కేర్ సెంటర్లలో పెద్ద సంఖ్యలో కుక్కలను చంపేస్తున్నారంటూ ఇటీవల కొన్ని వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంపై బల్దియా స్పందించింది. కొందరు ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ నెల 6న నిర్వహించిన ఇంటర్నల్మీటింగులో ఔట్‌సోర్సింగ్ స్టాఫ్లక్ష్మణ్ తన మొబైల్ ఫోన్ ద్వారా అనారోగ్యంతో ఉన్న, సహజంగా చనిపోయిన కుక్కల వీడియోలు, ఫొటోలు తీసి జంతు ప్రేమికులతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలకు పంపాడన్నారు. దీనికి అతడు డబ్బులు కూడా తీసుకున్నట్టు వెల్లడైందన్నారు.
ఈ తప్పుడు వీడియోల కారణంగా జనవరి 5 నుంచి యానిమల్ కేర్ సెంటర్ వద్ద కొందరు వలంటీర్లు, ఎన్జీఓ సభ్యులు గుమిగూడి ఆందోళన చేస్తున్నారని, దీంతో విధులకు ఆటంకం కలుగుతోందన్నారు. సుప్రీంకోర్టు గతేడాది నవంబర్‌లో ఇచ్చిన ఆదేశాల మేరకు స్కూల్స్, దవాఖానలు, రైల్వే స్టేషన్లు వంటి పబ్లిక్ప్లేసెస్లో కుక్కలను గుర్తించి యానిమల్ కేర్ సెంటర్లకు తరలిస్తున్నామన్నారు.
