
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో గురువారం మేయర్ విజయలక్ష్మి అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. కమిషనర్ ఆర్వీ కర్ణన్, కమిటీ సభ్యులు, అధికారులు హాజరయ్యారు. 32 అంశాలు, 7 టేబుల్ ఐటమ్స్‌కు సభ్యులు ఆమోదం తెలిపారు. ప్రధానంగా స్ట్రీట్ లైట్ల ఈఈఎస్ఎల్ సంస్థ గడువు పూర్తవడంతో ఎల్ఈడీ స్ట్రీట్ లైట్లు, సీసీఎంఎస్ ప్యానెల్స్ నిర్వహణ, ఏర్పాటు కోసం రూ.897 కోట్లతో టెండర్లు ఆహ్వానించాలని నిర్ణయించారు.
నగరంలో ఉన్న 404 ట్రాఫిక్ సిగ్నల్స్ నిర్వహణ, కొత్త సిగ్నల్స్ ఏర్పాటు కోసం రూ.72.31 కోట్లతో టెండర్లు వేస్తామన్నారు. ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లేఅవుట్‌లో మౌలిక వసతులు, ఓపెన్ స్పేస్‌ల కోసం కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.31 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే టోలిచౌకి ఫ్లైఓవర్ కింద నిర్మించిన 18 కొత్త వెండింగ్ షాప్‌లను మూడేండ్లపాటు టెండర్ కమ్ ఓపెన్ బహిరంగ వేలం ద్వారా ఇచ్చేందుకు ఆమోదం తెలిపారు.
గడువు ముగిసిన షాప్‌ల వేలం.
25 ఏండ్ల కంటే ఎక్కువ గడువు ముగిసిన ఖాళీ షాప్‌లకు బహిరంగ వేలం నిర్వహించాలని, గడువు ముగిసిన లీజులను పొడిగించడానికి, ఉత్తర్వుల ప్రకారం అద్దె పెంచడానికి అనుమతించారు. జీహెచ్ఎంసీ అసిస్టెంట్ ఎంటమాలజిస్టులు 33 మందిని ఔట్‌సోర్సింగ్ ద్వారా నియమించేందుకు రూ.91.48 లక్షలకు ఆడ్మినిస్ట్రేటివ్ ఆమోదం లభించింది. అలాగే, ఈ నియామకాల కోసం ఎల్1 బిడ్డర్‌గా నిలిచిన ఎంఎస్ ఈగల్ సెక్యూరిటీ సర్వీసెస్‌ను అనుమతించారు. మల్కం చెరువులో బోటింగ్, క్రీడల కోసం హైదరాబాద్ బోటింగ్ క్లబ్‌కు రూ.6 లక్షలు, నెల లైసెన్స్ ఫీజుతోపాటు జీఎస్టీ 10 శాతంతో మూడేండ్ల ఒప్పందానికి ఆమోదం తెలిపారు.
హైడ్రా నుంచి 223 మంది సెక్యూరిటీ గార్డుల సేవలను జీహెచ్ఎంసీ పార్కుల కోసం జోనల్ వారీగా ఉపయోగించేందుకు అనుమతించారు. 5 చోట్ల కేబీఆర్ పార్కింగ్ లాట్స్ కియోస్క్ టెండర్ కమ్ ఓపెన్ యాక్షన్ నిర్వహించేందుకు ప్రతిపాదనలకు కమిటీ ఆమోదం లభించింది. 50 లొకేషన్లలో విజయ్ డెయిరీ పార్లర్ల ఏర్పాటు కోసం రెంటల్ చార్జెస్ ఫిక్స్ చేయడానికి నిర్ణయించారు. కేబీఆర్ పార్క్ ఎంట్రీ–1 మల్టీ లెవెల్ పార్కింగ్ వద్ద 200 చదరపు ఫీట్లలో పబ్లిక్ టాయిలెట్స్నిర్మాణం, మూడేండ్లపాటు నిర్వహణ కోసం నవ నిర్మాణ అసోసియేట్ కు అప్పగించేందుకు ఆమోదం తెలిపారు.