- కాళ్లు మొక్కుతూ వినూత్న విజ్ఞప్తి
మెహిదీపట్నం, వెలుగు: రోడ్లపై చెత్త వేయొద్దని ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ జీహెచ్ఎంసీ ఔట్‌సోర్సింగ్ సూపర్వైజర్ వినూత్నంగా విజ్ఞప్తి చేశాడు. కార్వాన్ రామ్‌సింగ్‌పురా దర్బార్ మైసమ్మ ప్రాంతంలో స్థానికులు తరచూ రోడ్డుపక్కన చెత్త వేస్తుండటంతో సమస్య తీవ్రంగా మారింది.
మున్సిపల్ సిబ్బంది ప్రతిరోజూ చెత్త తొలగించినా మళ్లీ పేరుకుపోతుండటంతో శాశ్వత పరిష్కారం కోసం సూపర్వైజర్ మహేందర్ ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమం చేపట్టారు. తెల్లవారుజామున అక్కడే నిలబడి చెత్త వేయడానికి వచ్చే వారిని ఆపుతూ, ‘మీ కాళ్లు మొక్కుతా బాంచన్.. ఇక్కడ చెత్త వేయొద్దు’ అంటూ వేడుకున్నారు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు తన వంతు ఇలా విజ్ఞప్తి చేస్తున్నట్లు మహేందర్ తెలిపారు.
