హైదరాబాద్కు ఆరో ర్యాంక్.. స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో GHMCకు అవార్డుల పంట

హైదరాబాద్కు ఆరో ర్యాంక్.. స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో GHMCకు అవార్డుల పంట

హైదరాబాద్ సిటీ, వెలుగు:స్వచ్ఛ సర్వేక్షణ్​–- 2024లో ఈసారి జీహెచ్ఎంసీకి మెరుగైన ర్యాంక్ దక్కడంతోపాటు అవార్డుల పంట పండింది. గతేడాది 9వ ర్యాంక్​​తో ఫైవ్ స్టార్స్ ర్యాంక్ పొందగా, ఈసారి10 లక్షలకు పైగా జనాభా ఉన్న కేటగిరీలో 6వ ర్యాంక్​తో సెవెన్ స్టార్ హోదా దక్కించుకొని తెలంగాణలో స్వచ్ఛ షహర్​గా నిలిచింది. 

దీంతో పాటు  ఓడీఎఫ్ (ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ)​లో వాటర్ ప్లస్ సర్టిఫికెట్​ను కూడా దక్కించుకున్నట్లు కేంద్ర హౌజింగ్, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ  ప్రకటించింది. గురువారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌‌‌‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్​ చేతుల మీదుగా ఎంఏయూడీ సెక్రటరీ ఇలంబరితి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నేతృత్వంలోని బృందం ఈ అవార్డులను స్వీకరించింది.

సికింద్రాబాద్ కంటోన్మెంట్​కు మినిస్టీరియల్ అవార్డు

పద్మారావునగర్: సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు స్వచ్ఛ సర్వేక్షణ్ 2024–-25 మినిస్టీరియల్ అవార్డును దక్కించుకుంది. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్​లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నుంచి బోర్డు సీఈఓ మధుకర్ నాయక్, సభ్యురాలు బానుక నర్మద మల్లికార్జున్ ఈ అవార్డును అందుకున్నారు. 

దేశంలోని 62 కంటోన్మెంట్ బోర్డుల్లో ఈ అవార్డు పొందిన ఏకైక బోర్డు ఇదే. 95 శాతం చెత్త సేకరణ, రోజువారీ పర్యవేక్షణ, పబ్లిక్ టాయిలెట్ల నిర్వహణ, మార్కెట్లు, బస్టాప్​ల శుభ్రత, రామన్నకుంట సరస్సు పునరుద్ధరణ, చెట్ల పెంపకం, 125 స్వచ్ఛతా ర్యాలీలు, 100 వీధి నాటకాలు, 50 అవగాహన కార్యక్రమాలతో ప్రజల్లో అధికారులు చైతన్యం తెచ్చారు. భూగర్భ డ్రైనేజీ, నాలాల శుభ్రతతో పరిశుభ్రమైన, సురక్షితమైన పట్టణ వాతావరణాన్ని సృష్టించినట్లు సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు.