సిటీలో మరో కీలక ఫ్లైఓవర్.. నిర్మాణానికి బల్దియా రెడీ.. టెండర్లు పిలుపు

సిటీలో మరో కీలక ఫ్లైఓవర్..   నిర్మాణానికి బల్దియా రెడీ.. టెండర్లు పిలుపు

 

  • సాగర్ రింగ్​ రోడ్ నుంచి మందమల్లమ్మ జంక్షన్ వరకు నిర్మాణం
  • రూ.416 కోట్లతో 6 లేన్ల  ఫ్లైఓవర్
  • టీకేఆర్, గాయత్రినగర్, మందమల్లమ్మ జంక్షన్ల వద్ద తీరనున్న ట్రాఫిక్ తిప్పలు
  • ఈ నెల 20 వరకు బిడ్ల స్వీకరణ, 22న టెండర్లు ఫైనల్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలో మరో కీలక ఫ్లైఓవర్ నిర్మాణానికి బల్దియా రెడీ అయ్యింది. సాగర్ రింగ్​రోడ్ నుంచి మందమల్లమ్మ జంక్షన్ వరకు రూ.410 కోట్లతో 6 లేన్ల ఫ్లైఓవర్ నిర్మించడానికి జీహెచ్ఎంసీ టెండర్లు పిలిచింది. ఈ నెల 20 వరకు బిడ్లు స్వీకరించి, 22న టెండర్లు ఫైనల్ చేయనుంది. టెండర్లు ఖరారైన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్లైఓవర్ పూర్తయితే తీగల కృష్ణారెడ్డి, గాయత్రీనగర్, మందమల్లమ్మ జంక్షన్లలో ట్రాఫిక్ రద్దీ తగ్గి, ఉప్పల్ నుంచి మిధాని వరకు సునాయాసంగా ప్రయాణించవచ్చు. ఎల్బీనగర్ నుంచి ఎయిర్‌ పోర్టు, మహబూబ్​నగర్, నాగర్‌ కర్నూలు, శ్రీశైలం, కర్నూలు వైపు వెళ్లే వాహనదారులకు గణనీయంగా సమయం ఆదా అవుతుందని  అధికారులు చెప్తున్నారు.

ఈ ప్రాంతాలకు తీరనున్న తిప్పలు

మీర్ పేట్, బాలాపూర్, బడంగ్ పేట్, ఆర్సీఐ ప్రాంతాల నుంచి వచ్చే వారు మందమల్లమ్మ జంక్షన్ దగ్గర రోడ్డు దాటేందుకు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మీర్ పేట్ లోని ప్రాంతాల నుంచి వచ్చేవారు, జిల్లెలగూడ నుంచి వచ్చే వాహనదారులు ఎల్బీనగర్ తో పాటు  సిటీ లోపలికి వచ్చే వారికి గాయత్రినగర్ జంక్షన్ దగ్గర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూపేశ్ గుప్తా నగర్, మీర్ పేట్ లోని కొంతభాగం నుంచి వాహనదారులతో పాటు ఇక్కడ మూడు మెడికల్ కాలేజ్ లు ఉండటంతో  తీగల కృష్ణారెడ్డి  జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు తప్పడం లేదు. ఇక అటు వైపు సరూర్ నగర్, డిఫెన్స్ కాలనీ, కర్మన్ ఘాట్ ప్రాంతాల నుంచి సిటీ బయటకు వెళ్లేందుకు ఇబ్బందులు ఉన్నాయి. హెచ్​సిటీలో భాగంగా ఈ మూడు జంక్షన్లను (తీగల కృష్ణారెడ్డి, గాయత్రీనగర్, మందమల్లమ్మ జంక్షన్ల) కలుపుతూ నిర్మించబోయే ఈ బై డైరెక్షనల్ ఫ్లైఓవర్​తో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ తిప్పలు తప్పనున్నాయి. 

మరో నెల రోజుల్లో గ్రౌండింగ్ పనులు

హెచ్ సిటీ కింద చేపట్టనున్న ప్రతి ప్రాజెక్టు నిర్మాణానికి క్షేత్ర స్థాయిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా భూసార పరీక్షలు, గ్లోబర్ పొజీషన్ రిఫరెన్స్ (జీపీఆర్) సర్వేలు కూడా నిర్వహిస్తున్నారు. హెచ్ సిటీ కింద చేపట్టిన అన్ని ప్రాజెక్టుల పనులను వీలైనంత త్వరగా  గ్రౌండింగ్ చేసి మరో నెల రోజుల్లో పనులను ఫీల్డ్  లేవెల్ లో మొదలు పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే  ఈ పనులు జరుగుతున్న చోట ట్రాఫిక్ మళ్లింపు అంశంపై ఇప్పటికే సిటీ ట్రాఫిక్ పోలీసులతో ఇంజినీరింగ్ విభాగం అధికారుల సమావేశం కూడా ముగిసినట్లు తెలిసింది. పనుల ప్రారంభానికి ముందే సిటీ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. ఈ మూడు జంక్షన్లకు సంబంధించి కూడా పనులు త్వరగా మొదలు పెట్టేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.