పర్మిషన్ లేకుండా రోడ్డు తవ్వితే క్రిమినల్ కేసు...జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం

పర్మిషన్ లేకుండా రోడ్డు తవ్వితే క్రిమినల్ కేసు...జీహెచ్ఎంసీ కమిషనర్ కీలక నిర్ణయం
  •     నేడో, రేపో సర్య్కులర్  
  •     వానకాలం మొదలైనా తవ్వకాలు ఆగకపోవడంతో యాక్షన్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు:  నగరంలో అనుమతులు లేకుండా రోడ్లను తవ్వితే క్రిమినల్​కేసు పెట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన సర్క్యులర్​నేడో, రేపో రానున్నది. వర్షాకాలం ప్రారంభమైనా సిటీలో పలు చోట్ల రోడ్ల తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. నీటి పైపులైన్లు, కరెంట్​కేబుల్స్, టెలికాం లైన్ల పనుల పేరుతో ఎక్కడోచోట రోడ్లను తవ్వి వదిలేస్తుండడంతో వర్షాలు పడ్డప్పుడు గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని గురించి ఎన్నోసార్లు వార్నింగ్​ఇచ్చినప్పటికీ వినకపోవడంతో ఇక నుంచి కఠినంగా వ్యవహరించాలని జీహెచ్‌‌ఎంసీ నిర్ణయించింది. 

రోడ్ల కటింగ్‌‌లపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు, పర్మిషన్​లేకుండా రోడ్లను తవ్వే వారిపై సర్కిల్ లెవెల్​లో డిప్యూటీ కమిషనర్లు పీఎస్​లలో ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. రోడ్లు తవ్వే ముందు అనుమతులు తీసుకోవాలని, పనులు పూర్తయ్యాక రిపేర్లు  చేయాలని లేకపోతే భారీ జరిమానాలు విధించాలని డిసైడ్​అయ్యారు. వీరిపై కూడా క్రిమినల్​ కేసులు పెట్టే ఆలోచనలో ఉన్నారు. రోడ్ల తవ్వకాలకు సంబంధించి సర్కిల్ అధికారులే బాధ్యత వహించేలా ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉంది. 

రూల్స్ ​ఇవే.. 

10 మీటర్ల వరకు రోడ్డు కటింగ్ కు సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్(ఈఈ) అనుమతులివ్వనున్నారు. 15 మీటర్ల రోడ్డు కటింగ్ కోసం వచ్చిన దరఖాస్తులను సూపరింటెండెంట్ ఇంజినీర్(ఎస్​ఈ) పరిశీలించి, పర్మిషన్​ఇవ్వడంతో పాటు పనులు పూర్తయిన తర్వాత పునరుద్ధరణకు హెడ్ ఆఫీసుకి ఫైల్ పంపించాల్సి ఉంటుంది. 15 మీటర్ల కన్నా ఎక్కువ రోడ్డు కటింగ్​కు పర్మిషన్​కోరితే ఫీల్డ్ లెవెల్​లో తనిఖీలు చేసి, రిపోర్ట్​తో పాటు ఫైల్ ను ఆఫీసు ద్వారా చీఫ్ ఇంజినీర్ (సీఈ)కి పంపి ఆమోదం పొందాలి. 15 మీటర్ల లోపు రోడ్ కటింగ్​కు అనుమతి ఇచ్చే ముందు సూపరింటెండెంట్ ఇంజినీర్ ఫీల్డ్ విజిట్ చేయాలి. వీటన్నింటినీ సర్క్యులర్​లో పొందుపరచనున్నారు.