- ఫుట్‌పాత్‌పై ఆక్రమణలుండొద్దు..
- ప్రతి శనివారం స్పెషల్ డ్రైవ్ చేయండి
- డబ్బాలు, దుకాణాలు,అక్రమ కట్టడాలు తొలగించండి
- సర్క్యులర్ జారీ చేసిన కమిషనర్
హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని మెయిన్‌రోడ్లు, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపనున్నది. ఫుట్‌పాత్‌లను ఆక్రమించి నిర్మించిన దుకాణాలు, అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు ఆదేశాలు, సీఎం సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో పాటు శాసనమండలిలోనూ ఇదే అంశాన్ని సీఎం ప్రస్తావించడంతో జీహెచ్ఎంసీ కఠిన చర్యలకు సిద్ధమైంది.
అలాగే ఫుట్‌పాత్‌లపై ఇటీవల దాఖలైన రిట్ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆక్రమణలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఫుట్‌పాత్‌లపై ఆక్రమణలు తొలగించేందుకు ప్రతి శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించేందుకు కమిషనర్ కర్ణన్ఈనెల 23న సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని సర్కిళ్లలో ప్రతి శనివారం తప్పనిసరిగా ఆక్రమణల తొలగింపు కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు.
కేవలం చిన్న చిన్న ఆక్రమణలే కాకుండా, వాణిజ్య సముదాయాల ముందు ఫుట్‌పాత్‌లను ఆక్రమించి చేసిన నిర్మాణాలను కూడా తొలగించాలన్నారు. ఆక్రమణలు తొలగించిన తర్వాత మళ్లీ ఆక్రమించకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో సీఎం సూచనల మేరకు ఎంపిక చేసిన మెయిన్‌రోడ్లలో పోలీస్, ట్రాఫిక్ విభాగాల సమన్వయంతో 'ఎండ్ -టు -ఎండ్' క్లియరెన్స్ చేపట్టాలని మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సూచించారు.
