హైదరాబాద్లో రోడ్లు తవ్వితే మళ్లీ వేయాల్సిన బాధ్యత మీదే.. వాటర్ బోర్డుకు GHMC హెచ్చరికలు

హైదరాబాద్లో రోడ్లు తవ్వితే మళ్లీ వేయాల్సిన బాధ్యత మీదే.. వాటర్ బోర్డుకు GHMC హెచ్చరికలు
  • రోడ్లు తవ్వి వదిలేయడంపై రూ.58 కోట్లు వసూలు 
  • జలమండలికి చెల్లించే బిల్లుల్లో కోత విధించిన జీహెచ్ఎంసీ
  • ఇకపై తవ్విన కాంట్రాక్టర్ తోనే రోడ్డు వేయించాలని సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్​లో వివిధ అభివృద్ధి పనుల కోసం  రోడ్లను తవ్వి, వాటిని తిరిగి వేయకుండా వదిలివేయడంపై బల్దియా వాటర్ బోర్డుకు హెచ్చరిక జారీ చేసింది. రోడ్లు తవ్విన తర్వాత వాటిని తిరిగి వేయాల్సిన బాధ్యత పూర్తిగా ఆయా శాఖలదేనని జీహెచ్‌‌‌‌ఎంసీ స్పష్టం చేసింది. నగరంలో రోడ్లు తవ్వి తిరిగి వేయడంలో నిర్లక్ష్యం వహించినందుకు గాను రూ.58 కోట్లు వాటర్ బోర్డు నుంచి వసూలు చేసింది. 

ప్రజలకు ఇబ్బంది కలిగించేలా రోడ్లను తవ్వి వదిలివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకపై, రోడ్లు తవ్వడానికి ముందు తప్పనిసరిగా ఎన్వోసీ తీసుకోవాలని జీహెచ్‌‌‌‌ఎంసీ ఆదేశించింది. అంతేకాకుండా, రోడ్లు తవ్వే కాంట్రాక్టర్ తోనే తిరిగి రోడ్డు వేయించాలని సూచించింది. లేకపోతే ఇదే విధంగా రికవరీ చేయక తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జలమండలికి జీహెచ్ఎంసీ చెల్లించే బిల్లుల్లో రూ.58 కోట్ల కోతలు విధించింది. ఈ నిధులతో జలమండలి పనుల కోసం తవ్విన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ తిరిగి రోడ్లను వేయనుంది.

రాత్రికి రాత్రే తవ్వకాలు..

జలమండలి పైపులైన్ పనులు, డ్రైనేజీ, కేబుల్స్, ఎలక్ట్రిసిటీ పనులంటూ మెయిన్​రోడ్ల నుంచి కాలనీలకు వెళ్లే రోడ్లను ఏదో ఒక పని పేరుతో కాంట్రాక్టర్లు తవ్వుతూనే ఉన్నారు. చాలాచోట్ల రోడ్లు తవ్వేసి రోజులు గడిచినా రిపేర్లు చేయడం లేదు. గ్రేటర్​లో 9,013 కి.మీ మేర రోడ్లు విస్తరించి ఉండగా, ఇందులో 2,846 కి.మీ మేర బీటీ రోడ్లు, 6,167 కి.మీ మేర అంతర్గత సీసీ రోడ్లు ఉన్నాయి.

 గ్రేటర్ లోని రోడ్లపై ఎలాంటి పనులు చేపట్టాలన్నా సంబంధిత డిపార్ట్​మెంట్ల నుంచి ఎన్వోసీలు తీసుకోవాల్సి ఉంది. పనులు పూర్తయిన తర్వాత తిరిగి రోడ్లు వేసే బాధ్యత సదరు కాంట్రాక్టర్ పైనే ఉంటుంది. ఒకవేళ కాంట్రాక్టర్ రోడ్లు వేయకపోతే ఆ పనికి సంబంధించి బిల్లులు ఆపే అధికారం ఆయా డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లకు ఉంటుంది. కానీ ఈ విషయాన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. ఇదే అలుసుగా కాంట్రాక్టర్లు రోడ్లు బాగు చేయకుండానే చేతులు దులుపుకుంటున్నారు. అంతేగాక చాలా పనులకు కాంట్రాక్టర్లు ఎన్వోసీలు తీసుకోకుండా రాత్రికి రాత్రే పనులు చేసి వదిలేస్తున్నారు.

జీహెచ్ఎంసీపై విమర్శలు..

సిటీలో వివిధ పనుల కోసం అక్రమంగా రోడ్లు తవ్వి అలాగే వదిలేస్తుండటంతో రోడ్లు డ్యామేజ్ ఉన్నా పట్టించుకోవడంలేదని జీహెచ్ఎంసీపై విమర్శలు వస్తున్నాయి. రోడ్లు గుంతలు, పాట్ హోల్స్ ని పూడ్చడంలేదని నగర వాసులు అంటున్నారు. ఒక్క జలమండలి కాకుండా ఇతర పనుల కోసం కూడా రోడ్లను తవ్వుతున్నారు.

 ఇకపై ఇలాంటి వారిపై నిఘా పెట్టి అక్రమంగా రోడ్లను తవ్వుతున్న వారికి భారీగా జరిమానాలు సైతం విధించాలని బల్దియా ప్లాన్ చేస్తుంది. ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని జీహెచ్ఎంసీ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే జలమండలి నుంచి రికవరీ చేసింది. ఈ రికవరీ చేయడంపై ఇతర విభాగాలు కూడా ఇకపై అలెర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.