
- చిన్న పనుల నుంచి హెచ్సిటీ వరకు అన్నీ ఒకే దగ్గర చూసే అవకాశం
- పనుల్లో నిర్లక్ష్యం, అలసత్వంపై కమిషనర్ వరుస సమీక్షలు
- ఎన్ని రివ్యూలు చేసినా ఫలితం లేకపోవడంతో కొత్త విధానానికి ప్లాన్
హైదరాబాద్ సిటీ, వెలుగు:గ్రేటర్ హైదరాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనుల్లో జరుగుతున్న నిర్లక్ష్యం, అలసత్వానికి చెక్ పెట్టేందుకు బల్దియా రెడీ అయ్యింది. కొత్త రకమైన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేంచేందుకు కసరత్తు చేస్తున్నది. టెక్నాలజీ ద్వారా ఎక్కడ కూడా పనులు ఆలస్యం కాకుండా, ఒక వేళ ఆలస్యమైతే సంబంధిత అధికారులదే జవాబుదారిగా చూపేందుకు సిద్ధమైంది.
ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కొన్ని పనులు నాలుగైదేండ్ల నుంచి టెండర్లు కాకపోవడం, మరి కొన్ని టెండర్లు పూర్తయినా పనులు ప్రారంభించకపోవడం, ఇంకొన్ని పనులు మొదలుపెట్టినా త్వరగా పూర్తి కావడంలేదు. ఇందుకు కారణాలను తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ అన్ని విభాగాలతో విడివిడిగా రివ్యూలు నిర్వహిస్తున్నారు.
ఒక్కో విభాగంతో ఒక్కో రోజు రివ్యూలు నిర్వహిస్తున్నా పనుల్లో వేగం కనిపించడంలేదు. దీంతో జీహెచ్ఎంసీలో వర్క్ మానిటరింగ్ సిస్టమ్ ను అందుబాటులోకి తేవాలని కమిషనర్ భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి శుక్రవారం ఐటీ, రెవెన్యూ అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఇంజినీరింగ్, మెయింటెనెన్స్ విభాగం అధికారులతో ప్రత్యేక వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించనున్నారు.
ప్రత్యేక డ్యాష్‌బోర్డు
అభివృద్ధి, రిపేర్లు తదితర పనులకు సంబంధించి ఏ పనులు ఏ స్టేజ్ లో ఉన్నాయన్నది డ్యాష్ బోర్డు ద్వారా కమిషనర్, అడిషనల్ కమిషనర్లతో సహా హెచ్ వోడీలు తెలుసుకునేందుకు వీలుగా చర్యలు తీసుకోనున్నారు. ఈ సిస్టమ్ ద్వారా ప్రాజెక్టు లేదా నిర్వహణ పనులు ఏ దశలో ఉన్నాయనేది ఉన్నతాధికారులు, ముఖ్యంగా కమిషనర్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీని ద్వారా పనులు స్లోగా జరుగుతున్న వాటిపై కమిషనర్ ఫోకస్ పెట్టేందుకు అవకాశం ఉంటుంది.
వర్క్స్ మంజూరు నుంచి ఏ స్టేజిలో ఉన్నాయనేది డాష్ బోర్డులో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఏ అధికారి పరిధిలో, ఏ శాఖలో ఆలస్యం జరుగుతోందో ఈ డాష్‌బోర్డు ద్వారా వెంటనే గుర్తించవచ్చు. నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకోవడానికి, జవాబుదారీతనాన్ని పెంచడానికి ఈ సిస్టం ఎంతో
ఉపయోగపడనుంది.
ఈజీగా కమిషనర్ మానిటరింగ్
జీహెచ్ఎంసీ పరిధిలో పలు శాఖల మధ్య సమన్వయ లోపంతో పాటు పనులను త్వరగా పూర్తి చేయడంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహించడంతో జాప్యం అవుతున్నట్లు కమిషనర్ గుర్తించారు. ఈ నేపథ్యంలో కమిషనర్ వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నా, ఆశించినంత త్వరగా పనులు కావడంలేదు. దీంతో కమిషనర్ ప్రతి మంగళవారం ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాల్సి వస్తుంది.
ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పనుల పురోగతిని పారదర్శకంగా ట్రాక్ చేసేందుకు ఈ డ్యాష్ బోర్డు రూపకల్పనకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈ నూతన వ్యవస్థ అందుబాటులోకి వస్తే కమిషనర్ ఈజీగా వివరాలు తెలుసుకునే వెసులుబాటు ఉంటుంది. పనుల్లో పారదర్శకత, జాప్యం లేకపోవటం, ఆన్‌లైన్ వ్యవస్థ పనుల అంచనా, ప్రొక్యూర్మెంట్, వర్క్ ఆర్డర్, క్వాలిటీ కంట్రోల్, బిల్లులు, చెల్లింపులు వంటి ప్రతి అంశంలో పారదర్శకత పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు.