
కాంగ్రెస్ లో చేరికపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ క్లారిటీ ఇచ్చారు. ఎంఐఎంతో దోస్తీ ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరబోనని చెప్పారు. తాను ఏ పార్టీలో చేరడానికి సిద్ధంగా లేనని అన్నారు. బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు రాజాసింగ్. ఉప ఎన్నిక వస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. ఎవరు పోటీ చేసినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు రాజాసింగ్.
జులై 20న ఉదయం సికింద్రాబాద్ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారిని దర్శించుకున్నారు రాజాసింగ్. అనంతరం మాట్లాడిన రాజాసింగ్.. అమ్మవారి గుడిని వైభవంగా కడతామని గత ప్రభుత్వం రాజకీయం చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వమైనా.. సింహవాహిని మహంకాళి అమ్మవారి గుడిని వైభవంగా కట్టాలి. బోనాలపై తాగి ఆడే బోనాలని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. బోనాలపై కుట్ర జరుగుతోంది. బోనాల సంస్కృతి నాశనం చేయడానికి చాలా కాలంగా కుట్ర జరుగుతోంది. రాష్ట్రంలో గోవధ జరగకుండా పటిష్ట చట్టం తీసుకు రావాలి. మోడల్ గో శాల నిర్మించాలి అని రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
గత కొంత కాలంగా పార్టీ నాయకత్వంపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న రాజా సింగ్ జూన్ 30న బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే..లంగాణలో బీజేపీ అధికారంలోకి రావొద్దని అనుకునే వారి సంఖ్య పార్టీలో ఎక్కువైందన్నారు. మీకో దండం.. మీ పార్టీకో దండం అంటూ తీవ్ర అసంతృప్తి వెళ్లగక్కారు. ఇన్నాళ్లు పార్టీలో సహకరించిన వారిందరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు.