మహారాష్ట్ర నుంచి కేరళకు భారీ కార్గో: ‘ఇస్రో మెషీన్’ గమ్యం చేరడానికి ఏడాది పట్టింది

మహారాష్ట్ర నుంచి కేరళకు భారీ కార్గో: ‘ఇస్రో మెషీన్’ గమ్యం చేరడానికి ఏడాది పట్టింది

మహారాష్ట్రలోని నాసిక్ నుంచి కేరళలోని తిరువనంతపురం మధ్య దూరం 1760 కిలోమీటర్లు. కారులోనో.. బస్సులోనో ప్రయాణం చేస్తే మహా అంటే రెండ్రోజుల్లోపే చేరుకోవచ్చు. కానీ ఓ భారీ మెషీన్‌తో కార్గో లారీ ఈ రెండు సిటీల మధ్య ప్రయాణానికి ఏడాదిపైనే పట్టింది. ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో)కు సంబంధించిన భారీ మెషీన్‌ను తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కి చేర్చేందుకు ఇంతటి సుదీర్ఘ సమయం సమయం పట్టింది. నాసిక్‌లోని ఓ తయారీ సంస్థ ఎరోస్పేస్ హారిజాంటల్ ఆటోక్లేవ్ మెషీన్‌ను తయారు చేసింది. స్పేస్‌లోకి పంపే రాకెట్లు, శాటిలైట్లలో వాడే అత్యంత తేలికైన వస్తువుల తయారీకి ఈ మెషీన్‌ను ఉపయోగిస్తారు. దీనిని తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌కు చేర్చడానికి నాసిక్ నుంచి 2019 జూలై 8న భారీ ట్రక్ ప్రయాణమైంది. సంవత్సరం పైగా ప్రయాణం చేసిన తర్వాత 2020 జూలై 19న (ఆదివారం) ఎట్టకేలకు తిరువనంతపురం చేరుకుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్‌లో ఇవాళ ఆ మెషీన్‌ను అప్పగించామని ఆ ట్రక్‌తో వచ్చిన ఓ ఉద్యోగి చెప్పాడు.

ఏడాదిపాటు 32 మంది ఉద్యోగుల శ్రమ.. రోజుకు నాలుగైదు కిలోమీటర్ల ట్రావెల్

నాసిక్ నుంచి తిరువనంతపురానికి ఈ భారీ మెషీన్‌ను తెచ్చేందుకు ఏడాదిపాటు 32 మంది ఉద్యోగులు శ్రమించారు. అంత దూరం ట్రక్‌తో పాటు వారంతా ప్రయాణిస్తూ ఏ సమస్య లేకుండా గమ్యానికి చేర్చారు. ఆ మెషీన్ 70 వేల కిలోల పైగా బరువు, ఏడున్నర మీటర్ల ఎత్తు, 6.65 మీటర్ల వెడల్పు ఉందని దానిని తరలించిన ఉద్యోగి చెప్పాడు. దారిలో కరెంటు వైర్లు తగలకుండా, పక్కన ప్రయాణించే వాహనాలకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటూ మెషీన్‌ను తీసుకుని వచ్చామని తెలిపాడు. రోజుకు నాలుగు నుంచి ఐదు కిలోమీటర్ల లోపు మాత్రమే ప్రయాణించగలిగేవారమని, ఎట్టకేలకు ఏడాది తర్వాత డెలివరీ ఇవ్వగలిగామని చెప్పాడు. ఆ మెషీన్ ఎత్తు ఎక్కువగా ఉండటం కారణంగానే సముద్ర మార్గంలో కార్గో షిప్ ద్వారా దాన్ని తరలించడం కుదరలేదని, దీంతో రోడ్డు మార్గంలోనే తీసుకుని రావాల్సి వచ్చిందని అన్నాడు.