హైదరాబాద్ సిటీ, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువస్తున్న ‘గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ చట్టం 2025’ చరిత్రాత్మకమని గిగ్ అండ్ ప్లాట్ ఫాంవర్కర్స్ యూనియన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. క్యాబ్ డ్రైవర్లు, ఆటోడ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, లాజిస్టిక్స్, గ్రాసరీ, సర్వీస్ రంగ కార్మికుల జీవితాల్లో మార్పు వస్తుందని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వివేక్ వెంకటస్వామి వల్లే ఇది సాధ్యమవుతోందని యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ అన్నారు.
తమ సమస్యలు విని అండగా నిలుస్తున్న ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ చట్టం అమల్లోకి వచ్చినపుడు కార్మికులకు యూనివర్సల్ రిజిస్ట్రేషన్, ప్రత్యేక ఐడీ లభిస్తాయయన్నారు. అలాగే సామాజిక భద్రత, సంక్షేమ బోర్డు ఏర్పాటు వల్ల సమస్యలు తగ్గి ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందే అవకాశం ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ చట్టంతో గిగ్ కార్మికుల హక్కులకు రక్షణ కలుగుతుందన్నారు.
