గిర్‌‌ సింహాలు తిరుగుడు తగ్గించినయ్‌‌

గిర్‌‌ సింహాలు తిరుగుడు తగ్గించినయ్‌‌

గుజరాత్‌‌ రాష్ట్రం గిర్‌‌ అడవిలోని సింహాలు అవి తిరిగే ప్రాంతం పరిధిని తగ్గించుకున్నాయి. ఒకప్పుడు శాంక్చుయరీ బయట 250 నుంచి 300 చదరపు కిలోమీటర్ల వరకు తిరిగిన లయన్స్‌‌ ఇప్పుడు 30 నుంచి 40 చదరపు కిలోమీటర్ల వరకే తిరుగుతున్నాయి. పైగా కొన్ని సింహాలు వాటి ఆవాసం, వేటకు వెళ్లే ప్రాంతాల పరిధిలో ఊళ్లనూ చేర్చేసుకున్నాయి. గుజరాత్‌‌ అటవీ శాఖ అధికారుల పరిశీలనలో ఈ విషయం తెలిసింది. సింహాలకు అమర్చిన రేడియో కాలర్స్‌‌తో వాటి కదలికలను గమనించామని చెప్పారు. సుమారు 75 సింహాలకు వీటిని అమర్చామని, వీటిలో 60 గిర్‌‌ శాంక్చుయరీ బయట ఉన్నాయని వెల్లడించారు. 2015 లెక్కల ప్రకారం గిర్‌‌లో 523 సింహాలుండేవి. వీటిలో 168 శాంక్చుయరీ బయట ఉన్నాయి. కానీ గిర్‌‌లో 800 వరకు సింహాలున్నాయని ఆ రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. వీటిలో 340 వరకు శాంక్చుయరీలో, మిగిలినవి అమ్రేలి, గిర్‌‌ సోమ్‌‌నాథ్‌‌, భావ్‌‌నగర్‌‌, పోర్‌‌బందర్‌‌, జునాగఢ్‌‌లలో తిరుగుతున్నాయన్నారు. ఈజీగా ఆహారం దొరుకుతుండటంతో వాటినే పర్మనెంట్‌‌ ఆవాసాలుగా మార్చుకున్నాయని నిపుణులు చెబుతున్నారు.