కాజీపేటలో బాలిక మిస్సింగ్

కాజీపేటలో బాలిక మిస్సింగ్
  • అక్క భర్తే నిందితుడు
  • 24 రోజులైనా దొరకని ఆచూకీ
  • మానవ హక్కుల కమిషన్​ను ఆశ్రయించిన తల్లిదండ్రులు

కాజీపేట, వెలుగు: కాజీపేటలో బాలిక కిడ్నాప్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 7న ఘటన జరగగా 24 రోజులైనా బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు జిల్లా మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.  బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. కాజీపేట మండలం మడికొండ వెంకటేశ్వర కాలనీకి చెందిన సదిరం కరుణ, వెంకటేశ్వర్లు దంపతులకు ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు మానసకు జనగామ జిల్లా పెంబర్తికి చెందిన రైల్వే ఉద్యోగి భూపెల్లి మధుతో 2020లో పెండ్లి చేశారు. వారికి ప్రస్తుతం ఏడాదిన్నర వయస్సు పాప ఉంది. దంపతులు మధ్య గొడవలతో మానస కొన్ని నెలలుగా పుట్టింటి దగ్గరే ఉంటోంది. కాజీపేట బాపూజీ నగర్ లోని స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న మానస చిన్న చెల్లి సిరి(14)ని ఈ నెల 7న మధు బైకుపై ఎక్కించుకొని తీసుకెళ్లాడు. వెళ్లేముందు ఆమె బ్యాగుతోపాటు తన సెల్ ఫోన్ ను మధు బాలిక ఫ్రెండ్స్​తో ఆమె ఇంటికి పంపించాడు. బాలిక కోసం తల్లిదండ్రులు వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా వారిద్దరు బైకుపై రఘనాథ్​పల్లి చెక్ పోస్ట్ దాటినట్లు గుర్తించారు. 24 రోజులు గడిచినా కేసులో ఇంకెలాంటి పురోగతి లేదు. దీంతో తల్లిదండ్రులు శనివారం జిల్లా మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించారు. కమిషన్ జిల్లా చీఫ్ రహిమున్నీసా బేగం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బాలిక ఇంటికి వచ్చిన సభ్యులు ఆమె తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో మాట్లాడారు. నిందితుడు సెల్ ఫోన్, ఏటీఎం కార్డ్ లాంటివి ఉపయోగించకపోవడంతో ఆచూకీ కనుక్కోవడం కష్టంగా మారిందని పోలీసులు అంటున్నారు. నిందితుడి కుటుంబసభ్యులు, ఫ్రెండ్స్​ను ఎంక్వైరీ చేస్తున్నామని,అతను గతంలో పనిచేసిన ప్రాంతాలకు కూడా స్పెషల్ టీంలను పంపించి గాలిస్తున్నామన్నారు.