90 డిగ్రీలు తిరిగిన తలతో..పదేళ్లుగా నొప్పితో

90 డిగ్రీలు తిరిగిన తలతో..పదేళ్లుగా నొప్పితో
  • పాకిస్థాన్‌ లో 11 ఏళ్ల అమ్మాయి అవస్థ
  • 8 నెలలప్పుడు ఆడుకుంటుండగా ప్రమాదం
  • కింద పడటంతో 90 డిగ్రీలు వంగిన మెడ
  • ఆపరేషన్‌ చేయిం చే స్తోమత లేని కుటుంబం
  • ఆదుకొమ్మని కోరుతున్న అన్నయ్య యాకూబ్‌

పాకిస్థాన్‌‌‌‌లోని సింధ్‌‌‌‌ రాష్ట్రం మిథిలో తల్లి జమీలాన్‌‌‌‌, అన్నయ్య మహ్మద్‌‌‌‌ యాకూబ్‌‌‌‌ కుంబర్‌‌‌‌తో కలసి ఉంటోంది అఫ్షీన్‌‌‌‌. తండ్రి గతేడాది ఆరోగ్యం బాగోలేక మరణించాడు. అఫ్షీన్‌‌‌‌ పుట్టినప్పుడు ఆరోగ్యంగానే ఉంది. కానీ 8 నెలలప్పుడు బయట ఆడుకుంటుండగా కింద పడి మెడ 90 డిగ్రీలు వంగిపోయింది. దీన్ని వైద్య భాషలో టార్టికొల్లిస్‌‌‌‌ అంటారు. వెన్నెముకకు, మెడ కండరాలకు దెబ్బ తగిలితే ఇలాంటి పరిస్థితి వస్తుంది.
తొలుత ఈ సమస్య వల్ల ఏం జరగదని తల్లిదండ్రులు అనుకున్నా తర్వాత తీవ్రత తెలిసింది. తల పైకి అనుకోలేక నొప్పితో అఫ్షీన్‌‌‌‌ బాధపడుతుండేది.తను పెరుగుతున్న కొద్దీ తినడం, నడవడం, టాయిలెట్‌‌‌‌కు వెళ్లడమూ కష్టమైపోయింది. స్కూలుకూ పోలేని పరిస్థితి. దగ్గరున్న కాస్త డబ్బుతో దగ్గర్లోని డాక్టర్లకు కుటుంబీకులు చూపించారు. కానీ ఫలితం లేదు. దీంతో అఫ్షీన్‌‌‌‌ భవిష్యత్‌‌‌‌ ఏంటని తల్లి బాధపడుతోంది.

స్పాన్సర్‌‌‌‌ ముందుకొచ్చినా..

అఫ్షీన్‌‌‌‌ విషయం ఆనోటా, ఈనోటా ప్రపంచానికి తెలియడంతో ఆపరేషన్‌‌‌‌ చేయించేందుకు ఓ స్పాన్సర్‌‌‌‌ ముందుకొచ్చారు. గతేడాది ఫిబ్రవరిలో కరాచీలోని ఆగాఖాన్‌‌‌‌ యూనివర్సిటీ హాస్పిటల్‌‌‌‌కు చిన్నారిని తీసుకెళ్లారు. డాక్టర్లు చెక్‌‌‌‌ చేశారు. ఆపరేషన్‌‌‌‌ చేస్తే 50–50 చాన్స్‌‌‌‌ ఉందని, ఆలోచించుకోమని చెప్పారు. అయితే అఫ్షీన్‌‌‌‌ ఇంట్లో పెళ్లి ఉండటంతో ఆపరేషన్‌‌‌‌ నెల ఆలస్యమైంది. తర్వాత స్పాన్సర్‌‌‌‌కు ఫోన్‌‌‌‌ చేస్తే స్పందించలేదని అన్నయ్య యాకూబ్‌‌‌‌ చెప్పాడు. తను ఇంతకుముందు ఓ మొబైల్‌‌‌‌ షాప్‌‌‌‌లో పని చేసేవాడు. కానీ చెల్లిని హాస్పిటల్‌‌‌‌కు తీసుకెళ్లేందుకు జాబ్‌‌‌‌ వదిలేశాడు. ప్రస్తుతం జాబ్‌‌‌‌ లేక ఖాళీగా ఉన్నాడు. తల్లికి వచ్చే రూ.5 వేల జీతంతోనే
కుటుంబమంతా బతకాలి.

నా చెల్లికి సాయం చేయండి

 

‘ఆపరేషన్‌ చేయిస్తానన్న స్పాన్సర్‌ స్పందిం చడం లేదు. మా దగ్గరేమో డబ్బుల్లేవు. నాకా ప్రస్తుతం జాబ్‌ లేదు. తల్లికొచ్చే కాస్త జీతంతోనే కుటుంబమంతా బతకాలి. అఫ్షీన్‌ ను హాస్పిటల్‌ తీసుకెళ్లాలన్నా కష్టమే. సాధారణ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో వెళ్లలేం . మా ఇంటి నుంచి కరాచీకి ప్రైవేట్‌ ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌లో వెళ్లాలంటే సుమారు రూ.6 వేలవుతుంది. చెల్లిని చూస్తుంటే బాధేస్తోంది. తనను అలా వదిలేస్తే ఇంకేమైనా సమస్యలొస్తాయే మోనని భయమేస్తోంది. తల ఎక్కు వ కాలం వంకరగా ఉంటే మెడ ఉబ్బి నరాలు దెబ్బతినొచ్చని డాక్టర్లు చెప్పారు. వెన్నెము కలో సమస్యలు రావొచ్చన్నారు. నా చెల్లికి సాయం చేయండి’. – అన్నయ్య యాకూబ్‌