ఆస్ట్రేలియాలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 100 మంది మృతి

ఆస్ట్రేలియాలో ఘోరం.. కొండచరియలు విరిగిపడి 100 మంది మృతి

మెల్‌‌బోర్న్: పపువా న్యూగినియాలో ఘోరం చోటుచేసుకుంది. ఎంగా ప్రావిన్స్‌‌లో మారుమూల ప్రాంతంలోని కౌకలం గ్రామంలో  కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో 100 మందికి పైగా మరణించినట్లు ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు తెలిపింది. రాజధాని పోర్ట్ మోర్స్ బైకి 600 కిలోమీటర్ల దూరంలో ఈ విపత్తు సంభవించిందని చెప్పింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు విరిగి గ్రామంపై పడ్డాయి. దీంతో పలు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్న సమయంలో కొండచరియలు విరిగిపడటంతో  ప్రాణనష్టం భారీగా వాటిల్లింది.

 శిథిలాల కింద నలిగిపోయిన వారి కోసం గ్రామస్తులు సహాయక చర్యలు చేపట్టారు. అనేక ఇండ్లు పూర్తిగా నేలమట్టమై బండరాళ్లు, చెట్ల కింద కూరుకుపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా డెడ్ బాడీలను వెలికి తీశామని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు వివరించారు. 

సహాయక చర్యల్లో అధికారులు పాల్గొంటున్నారని.. ఆస్తి, ప్రాణనష్టం గురించి సమాచారం అందుబాటులోకి రాగానే అధికారిక ప్రకటన విడుదల చేస్తామని పపువా న్యూగినియా ప్రధాని జేమ్స్ మరాపే పేర్కొన్నారు. దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు. రాళ్లు, చెట్ల కింద నుంచి డెడ్ బాడీలను బయటకు తీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్​గా మారాయి.