మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలంలో ఒక యువతి తన ప్రేమ కోసం రోడ్డెక్కింది. ఏడేళ్ల ప్రేమిచుకున్నాక పెళ్లి పీటల వరకు వచ్చేసరికి ప్రియుడు మొహం చాటేశాడని..తనకు న్యాయం చేయాలంటూ ప్రియుడి ఇంటి ముందు మౌన పోరాటానికి దిగింది .
గూడూరు మండలం గుండెంగ గ్రామానికి చెందిన రఘురామ్, అదే గ్రామానికి చెందిన స్పందన గత ఏడేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన రఘురామ్.. తీరా సమయం దగ్గర పడేసరికి పెళ్లి పీటలెక్కకుండా పరారయ్యాడు. ఈ విషయంపై ఇప్పటికే పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినప్పటికీ ఫలితం లేకపోవడంతో స్పందన నేరుగా ప్రియుడి ఇంటి ఎదుటే దీక్షకు కూర్చుంది.
నన్ను ప్రేమించిన రఘురామ్ తోనే నా పెళ్లి జరపాలి.. లేదంటే ఇక్కడే ప్రాణాలు వదిలేస్తాను అంటూ స్పందన ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఏడేళ్లుగా నీడలా వెంట తిరిగిన వ్యక్తి, ఇప్పుడు మోసం చేయడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పందన చేస్తున్న ఈ మౌన పోరాటానికి పలు ప్రజా సంఘాలు తమ మద్దతు ప్రకటించాయి. సమాచారం అందుకున్న గూడూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్పందనతో మాట్లాడారు. పరారీలో ఉన్న రఘురామ్ ను వెంటనే పట్టుకుని తమకు న్యాయం చేయాలని ఆమె పోలీసులను డిమాండ్ చేస్తోంది. తనకు న్యాయం జరిగే వరకు, తన ప్రియుడు వచ్చి పెళ్లికి ఒప్పుకునే వరకు ఈ ధీక్ష విరమించే ప్రసక్తే లేదని స్పందన తెగేసి చెబుతోంది.
