అబ్బాయిలు ఇంజినీరింగ్ వైపు..అమ్మాయిలు అగ్రి, ఫార్మా!

అబ్బాయిలు ఇంజినీరింగ్ వైపు..అమ్మాయిలు అగ్రి, ఫార్మా!

హైదరాబాద్, వెలుగు: అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులవైపు అమ్మాయిలు ఎక్కువ మొగ్గుచూపుతున్నారు. అబ్బాయిలతో పోలిస్తే రెండింతల ఎక్కువ మంది ఈ కోర్సులను ఎంపిక చేసుకుంటున్నారు. ఇంజినీరింగ్ కోర్సులపై మాత్రం అబ్బాయిలే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. టీఎస్ ఎప్ సెట్ కు సోమవారం ఉదయం వరకు మొత్తం 3,54,689 అప్లికేషన్లు అందాయి. వీటిలో అగ్రికల్చర్,  ఫార్మసీ స్ట్రీమ్ లో మొత్తం 1,00,227 మంది అప్లై చేసుకున్నారు. ఇందులో అబ్బాయిలు  27,003 (26.94%) మంది మాత్రమే దరఖాస్తు చేసుకోగా.. అమ్మాయిలు ఏకంగా 73,224(73.05%) మంది అప్లై చేశారు. 

అబ్బాయిలతో పోలిస్తే రెండింతల ఎక్కువ మంది అమ్మాయిలు అగ్రికల్చర్, ఫార్మసీకి అప్లై చేసుకున్నారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో మొత్తంలో 2,54,462 దరఖాస్తులు వచ్చాయి. అందులో అబ్బాయిలు 1,50,600 (59.18%) మంది ఉండగా, అమ్మాయిలు 1,03,862(40.8%) మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. ఈ లెక్కన ఇంజినీరింగ్ చదివేందుకు అబ్బాయిలు ఎక్కువ మక్కువ చూపుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అమ్మాయిలు ఇప్పుడిప్పుడే సంప్రదాయ కోర్సుల నుంచి బయటకు వస్తున్నారు. మ్యాథ్స్, లైఫ్ సైన్సెస్ కోర్సులు అమ్మాయిలే ఎక్కువ చదువుతున్నారు. ఇంజినీరింగ్​లో కంప్యూటర్ సైన్స్, ఏఐ లాంటి కోర్సులపై అమ్మాయిలు ఆసక్తి చూపిస్తుండగా.. మెకానికల్ ఇంజినీరింగ్​పై అబ్బాయిలు ఆసక్తి చూపిస్తున్నారు. ఓయూ పరిధిలోని పీజీ సైన్స్ కోర్సుల్లో ఏకంగా 76% మంది అమ్మాయిలే ఉండగా.. బాయ్స్ 24%  ఉన్నారు. 

ఓసీలూ ఇంజినీరింగ్ వైపే..

కమ్యూనిటీ వారీగా చూస్తే.. ఓసీ విద్యార్థులు ఎక్కువ మంది ఇంజినీరింగ్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఎప్​సెట్​కు మొత్తం 87,670 మంది ఓసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే.. 75,250 (85.83%) మంది ఇంజినీరింగ్​కు, 12,420 (14.16%) మంది అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు అప్లై చేసుకున్నారు. ఎస్సీలు ఇంజినీరింగ్ కు 27,423 మంది, అగ్రికల్చర్, ఫార్మసీకి 24,203 మంది దరఖాస్తు చేశారు. ఎస్టీల్లో 14,924 మంది ఇంజినీరింగ్ కు, 13,002 మంది అగ్రికల్చర్, ఫార్మసీ కోసం అప్లై చేసుకున్నారు.  

అమ్మాయిలు హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు వస్తున్నరు

ఇటీవలి కాలంలో హయ్యర్ ఎడ్యుకేషన్ వైపు అమ్మాయిలు ఎక్కువగా వస్తున్నారు. పేరెంట్స్ కూడా అబ్బాయిలతో పాటు అమ్మాయిలనూ చదివించేందుకు మొగ్గుచూపుతున్నారు. మెడికల్, లైఫ్ సైన్సెస్, ఫార్మసీ తదితర కోర్సుల్లో చేరేందుకు అమ్మాయిలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇంజినీరింగ్ లోనూ కేవలం సీఎస్ఈ, ఏఐ తదితర కోర్సుల్లోనే చేరుతున్నారు
- లింబాద్రి, టీఎస్​సీహెచ్​ఈ చైర్మన్