
బెంగళూరు: కరువు సాయం రూ.18,177.44 కోట్ల నిధులు త్వరగా విడుదల చేయాలని కర్నాటక సీఎం సిద్ధ రామయ్య ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. ఈ మేరకు ఆయన మంగళవారం కర్నాటక రెవెన్యూ మంత్రి కృష్ణ బైరె గౌడతో కలిసి ఢిల్లీలో మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రంలో పంటలు సరిగ్గా పండక పోవడంతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇన్ పుట్ సబ్సిడీని త్వరగా చెల్లించి వారి ఇబ్బందులు తీర్చాలని కోరారు.
కర్నాటకలో 223 తాలుకాలను ప్రభుత్వం కరువు ప్రభావిత జిల్లాలుగా ప్రకటించిందని.. ఆ ప్రాంతాల ప్రజలకు ఉపాధి హామీ పథకం కింద మరింత పనిని కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి జాబ్ కార్డుకు ప్రస్తుతం కల్పిస్తున్న100 పని దినాల సంఖ్యను 150కి పెంచాలన్నారు. రూరల్ డెవలప్ మెంట్ మినిస్ట్రీ వద్ద కొంతకాలంగా పెండింగ్లో ఉన్న ఈ అంశాన్ని పరిష్కరించాలని కోరారు.