
- 6 నుంచి10 సీట్లు ఇచ్చే చాన్స్
- ఇయ్యాల ఢిల్లీకి రాష్ట్ర నేతలు
- త్వరలో షాతో పవన్ భేటీ
హైదరాబాద్, వెలుగు: పొత్తులో భాగంగా తమకు 20 సీట్లు కేటాయించాలని బీజేపీని జనసేన కోరుతున్నట్టు తెలిసింది. ఇందులో ఎక్కువగా గ్రేటర్ హైదరాబాద్ లో సీట్లు ఇవ్వాలని, ముఖ్యంగా సెటిలర్స్ ఎక్కువుండే కూకట్ పల్లి, శేరిలింగంపల్లి సీట్లు కచ్చితంగా కేటాయించాలని పవన్ అడుగుతున్నట్టు సమాచారం. వీటితో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో మిగతా సీట్లు కావాలని కోరుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అయితే బీజేపీ మాత్రం 6 నుంచి 10 సీట్లు ఇవ్వాలని భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో 32 సీట్లలో పోటీ చేస్తామని ప్రకటించిన జనసేన.. ఆ నియోజకవర్గాల వివరాలను కూడా గతంలో విడుదల చేసింది. బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల చేయకముందు పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ వెళ్లి పవన్‌తో చర్చలు జరిపారు. ఇప్పుడు పొత్తులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాతో చర్చించేందుకు పవన్ కల్యాణ్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
లేదంటే ఈ నెల 27న రాష్ర్ట పర్యటనకు రానున్న అమిత్ షాతో హైదరాబాద్ లోనే చర్చలు జరిపే అవకాశం ఉంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా, అభ్యర్థుల రెండో లిస్ట్, జనసేనతో పొత్తుపై జాతీయ నేతలతో చర్చించేందుకు బీజేపీ రాష్ట్ర నేతలు బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. త్వరలో పార్టీ ఎన్నికల కమిటీ భేటీ అయి రెండో లిస్టుకు ఆమోదం తెలపనుంది. ఈ నెల 22న 52 మందితో బీజేపీ మొదటి లిస్ట్ విడుదల చేశారు. జనసేనతో పొత్తుపై స్పష్టత వచ్చాక రెండో లిస్ట్ విడుదల చేయనున్నట్టు నేతలు చెబుతున్నారు.