దళిత బంధు కమీషన్లు వాపస్ ఇయ్యండి

దళిత బంధు కమీషన్లు వాపస్ ఇయ్యండి

సిద్దిపేట/చేర్యాల, వెలుగు:  దళితబంధు పేరిట అధికార పార్టీ నేతలు వసూలు చేసిన కమీషన్లు తిరిగి ఇవ్వాలని దళితులు డిమాండ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు సైలెంట్‌‌గా ఉన్న వాళ్లు ఇటీవల సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలను హెచ్చరించిన తర్వాత బయటకు వచ్చి అల్టిమేటం వేస్తున్నారు.  ఈ మేరకు చేర్యాలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.  ఇక్కడి నేతలు దళితబంధు లిస్టులో పేరు చేరిస్తే  రూ. 2 లక్షలు ఇచ్చేలా ముందస్తు అగ్రిమెంట్ చేసుకోవడమే కాకుండా అడ్వాన్స్‌‌గా రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.  

రెండో జాబితాలో అవకాశం ఇస్తామని చెప్పి..

దళితబంధు రెండో విడత కింద ప్రతి నియోజకవర్గంలో 500 మందిని ఎంపిక చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. దీన్ని ఆసరాగా తీసుకున్న అధికార పార్టీ నాయకులు అక్రమ వసూళ్లకు తెరలేపారు. పథకం ఆశిస్తున్న దళితుల పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉండాలంటే రూ.2 లక్షలు ఇవ్వాలని,  ఇందులో కొంత అడ్వాన్స్‌‌గా ఇవ్వాలని ఒప్పందం చేసుకోవడం మొదలుపెట్టారు. ఇలా ఇప్పటివరకు చేర్యాల మున్సిపాలిటీలో 50 మంది, ఆకునూరు, మరో రెండు గ్రామాల్లో 30 మంది నుంచి రూ. 50 లక్షల నుంచి రూ. కోటి వరకు  వసూలు చేశారనే  ప్రచారం జరుగుతోంది.

 దళిత సంఘాల ఆందోళన 

ఈ వ్యవహారం అంతా ఆరు నెలల కిందే జరిగినా బయటికి రాలేదు. కానీ, 20 రోజుల మద్దూరు మండలానికి చెందిన నలుగురు దళితులు తమ నుంచి డబ్బులు వసూలు చేశారని బహిరంగంగా వెల్లడించారు.  అయితే బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు వారితో మాట్లాడి ఇష్యూ పెద్దది కాకుండా చూశారు. ఇటీవల సీఎం కేసీఆర్‌‌‌‌ దళితబంధు పేరిట ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కమీషన్‌‌ తీసుకుంటున్నట్లు తన దృష్టికి వచ్చిందని, తీరు మార్చుకోకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో చాలా మంది బాధితులు బయటికి వచ్చి డబ్బులు తీసుకున్న నేతలను వాపస్ ఇవ్వాలని కోరారు.  కానీ, వాళ్లు లైట్ తీసుకోవడంతో ఎమ్మార్పీఎస్‌‌, ఇతర దళిత సంఘాల నేతలకు విషయం చెప్పారు.  దీంతో వారు నాలుగు రోజుల కింద చేర్యాల పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఎవరి దగ్గరి నుంచి ఎవరెంత తీసుకున్నారో తమ వద్ద పూర్తి చిట్టా ఉందని, వెంటనే  డబ్బులు వాపస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

నేతలపై ఎమ్మెల్యే ఆగ్రహం

దళితబంధులో చేతి వాటాన్ని ప్రదర్శించిన నేతలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. వసూలు చేసిన డబ్బులను వెంటనే వారికి తిరిగి ఇవ్వాలని లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు సమాచారం.  దీంతో సదరు నేతలు విషయం పెద్దది కాకముందే మధ్యవర్తుల ద్వారా రాయబారాలు నడుపుతున్నట్టు తెలిసింది.  

డబ్బులు తిరిగివ్వాలి

 దళిత బంధు ఇప్పిస్తామని దళితుల వద్ద వసూలుచేసిన డబ్బులు తిరిగి ఇవ్వాలి.  ఏయే గ్రామాల్లో ఎంత మంది నుంచి డబ్బులు వసూలు చేశారనే వివరాలు ఉన్నయి. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి అర్హులకు  పథకం అందేలా చూడాలి.  డబ్బులు వెనక్కి ఇవ్వక పోతే ఆందోళన కార్యక్రమాలు కొనసాగిస్తం. 
-
 మల్లిగారి యాదగిరి, ఎమ్మెస్పీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు