ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వండి: కలకత్తా హైకోర్టు

ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్ ఇవ్వండి: కలకత్తా హైకోర్టు
  • ట్రాన్స్​జెండర్లకు 1%  రిజర్వేషన్ ఇవ్వాలి
  • బెంగాల్ సర్కారుకు కలకత్తా హైకోర్టు ఆదేశం

కోల్​కతా: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని శాఖలకు సంబంధించిన సర్కారీ కొలువుల్లో వాళ్లకు 1 శాతం రిజర్వేషన్ కేటాయించాలంటూ బెంగాల్ సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్(టెట్) 2014, 2022లో క్వాలిఫై అయినప్పటికీ తనను ఇంటర్వ్యూకు ఎంపిక చేయలేదని ఓ ట్రాన్స్​జెండర్ వేసిన పిటిషన్​పై కోర్టు ఇటీవల విచారించింది. 

లింగమార్పిడి చేసుకున్నోళ్లను థర్డ్ జెండర్​గా గుర్తించాలని, విద్యాసంస్థల్లో ప్రవేశాలు, నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించాలని 2014లోనే సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలను ఆదేశించిందని హైకోర్టు గుర్తు చేసింది. ట్రాన్స్​జెండర్లు సమాన ఉపాధి అవకాశాలకు అర్హులేనని 2022లో రాష్ట్ర విద్యాశాఖ ఇచ్చిన నోటిఫికేషన్​లో పేర్కొన్నట్లు బెంగాల్​ ప్రభుత్వ తరఫు అడ్వొకేట్ కోర్టుకు తెలిపారు. దీంతో సమాన అవకాశాలతో పాటు ట్రాన్స్​జెండర్లకు రిజర్వేషన్లు కూడా కల్పించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్​ను ఇంటర్వ్యూకు ఎంపిక చేయాలని విద్యాశాఖను ఆదేశించింది.