వర్సిటీల అభివృద్ధికి రూ.1,341 కోట్లు ఇవ్వండి : కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ విజ్ఞప్తి

వర్సిటీల అభివృద్ధికి రూ.1,341 కోట్లు ఇవ్వండి : కేంద్రానికి రాష్ట్ర విద్యాశాఖ విజ్ఞప్తి

 హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని యూనివర్సిటీలు, సర్కారు డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫెసిలిటీస్​ కోసం రాష్ట్ర విద్యాశాఖ కేంద్రానికి ఇటీవల ప్రతిపాదనలు పంపింది. ప్రధానమంత్రి ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (పీఏం ఉషా) స్కీమ్ కింద 2024–25 సంవత్సరానికి గానూ మొత్తం రూ.1341 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. యూనివర్సిటీలు, డిగ్రీ పీజీ కాలేజీలకు వేర్వేరుగా ప్రపోజల్స్ పంపించారు. ఈ నెల17న యూనివర్సిటీలకు సంబంధించిన ప్లానింగ్ అప్రూవల్ బోర్డు మీటింగ్(పీఏబీ) ఆన్​లైన్​లో జరిగింది. దీంట్లో కేంద్ర విద్యాశాఖ అధికారులతో పాటు రాష్ర్టం నుంచి కళాశాల విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. 

 దీంట్లో  జేఎన్టీయూహెచ్​, తెలంగాణ మహిళా యూనివర్సిటీ మినహా మిగిలిన 10 యూనివర్సిటీల్లో ఇన్​ఫాస్ర్టక్చర్, ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచేందుకు ప్రపోజల్స్ పెట్టారు. ఒక్కో వర్సిటీకి రూ.వంద కోట్ల చొప్పున ఏడు వర్సిటీలకు రూ.700 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపగా, 9 యూనివర్సిటీలకు రూ.20 కోట్లు చొప్పున రూ.180 కోట్లు ఇవ్వాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకూ కేవలం ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ తదితర సాంప్రదాయ వర్సిటీలకు మాత్రమే విద్యాశాఖ అధికారులు ప్రపోజల్స్ పెట్టేవారు. 

కానీ, ఈసారి వీటితో పాటు ఆర్జీయూకేటీ, ఫైన్ ఆర్ట్స్ వర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీల్లోనూ వసతుల కోసం ప్రతిపాదనలు చేశారు. మరోపక్క ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని డిగ్రీ, పీజీ కాలేజీల్లో చదివే విద్యార్థినుల కోసం 11  హాస్టళ్ల నిర్మాణానికి రూ.110 కోట్లు ఇవ్వాలని ప్రపోజల్స్ పెట్టారు. త్వరలోనే  కాలేజీలకు ఇచ్చే నిధులపై కేంద్ర విద్యాశాఖ సమావేశం నిర్వహించనున్నది. కాగా, గతేడాది రెండు విడుతల్లో రూ.507కోట్ల నిధులను కేంద్రం రిలీజ్ చేసింది.