సంక్రాంతికైనా శాలరీ ఇవ్వండి : కాంట్రాక్టు లెక్చరర్లు

సంక్రాంతికైనా శాలరీ ఇవ్వండి : కాంట్రాక్టు లెక్చరర్లు
  • రాష్ట్ర సర్కారుకు కాంట్రాక్ట్ లెక్చరర్ల విజ్ఞప్తి 
  • మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు 
  • ఇతర శాఖల్లోని 1.40 లక్షల కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకూ నెల జీతం పెండింగ్  

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో పనిచేసే కాంట్రాక్టు లెక్చరర్లు 3 నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డిగ్రీ, జూనియర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో5 వేల మంది కాంట్రాక్టు లెక్చరర్లు పనిచేస్తున్నారు. వారికి అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల జీతాలు పెండింగ్​లో ఉన్నాయి. ఆయా నెలల జీతాలకు సంబంధించి ట్రెజరీ నుంచి టోకెన్ నెంబర్లు రాగా, వాటిని ఈ– కుబేర్ కు పంపించారు. సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆ జీతాలు రిలీజ్ అవుతాయి. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని కాంట్రాక్టు లెక్చరర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి పండుగకైనా జీతాలు వస్తాయో, రావోనని వారంతా ఆందోళన చెందుతున్నారు.

ఒక్కనెల జీతం రాకుంటేనే అనేక ఇబ్బందులు పడతామని, అలాంటిది మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే  జీతాలు రిలీజ్ చేసి కాంట్రాక్ట్ లెక్చరర్ల కుటుంబాల్లో సంతోషాన్ని నింపాలని కోరుతున్నారు. హెల్త్, ఇరిగేషన్, వివిధ కార్పొరేషన్లు, రెవెన్యూ తదితర 36 డిపార్ట్​మెంట్లలోని1.40 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా డిసెంబర్ నెల జీతాలు రాలేదు. దీంతో వారి కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. ప్రతినెలా ఒకటిన వేతనాలు  చెల్లించాలని కోరింది. నెల నెలా జీతాలు రాకపోవడంతో ఈఎంఐలు సకాలంలో కట్టలేక ఫెనాల్టీలు చెల్లించాల్సి వస్తోందని కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం జనరల్ సెక్రటరీ కొప్పిశెట్టి సురేష్ అన్నారు. ఇంటి రెంట్ కట్టేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలు ఇవ్వాలని కోరారు.