
నిజామాబాద్, వెలుగు: నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామానికి చెందిన యువతికి ఎంగేజ్మెంట్అవ్వంగనే ఆఫీసర్లు కల్యాణలక్ష్మి పైసలు అందజేశారు. ఓ పక్క పెళ్లిళ్లు జరిగి నెలలు గడుస్తున్నా సర్కారు పైసలు అందక లబ్ధిదారులు ఆఫీసర్ల చుట్టూ తిరుగుతుంటే ఇక్కడ మాత్రం ఆఫీసర్లు పెళ్లికి ముందే చెక్కు ఇచ్చేశారు. కొద్ది రోజుల కిందే గ్రామానికి చెందిన ఓట్లం సాయి, పోషవ్వ కుమార్తె భారతికి ఎంగేజ్మెంట్చేశారు. వారం కింద ఆఫీసర్లు కల్యాణలక్ష్మి పైసలు పంపిణీ చేశారు. కమీషన్ కొట్టేద్దామనుకున్నారో ఏమో పైరవీ కారులు, అధికారులు కుమ్మక్కై మూడు ముళ్లకు ముందే సర్కారు సాయం ఇచ్చేశారు. విషయం బయటికి పొక్కడంతో సంబంధిత ఆఫీసర్లలో గుబులు మొదలైంది. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.