- వేసిన భూముల్లో 60 శాతం వరకు మొలకలు రాలే
- ఒకే లాట్ సీడ్స్లోనూ తేడాలు
- 76 వేల క్వింటాళ్ల సీడ్స్‌లో సగానికిపైగా జర్మినేషన్ సమస్య
- పెట్టుబడి నష్టపోయిన రైతులు.. నష్ట పరిహారం, నాణ్యమైన సీడ్స్ ఇవ్వాలని డిమాండ్
- పాత విత్తనాల ప్యాకెట్లు ఇస్తే కొత్తవి ఇస్తున్న అధికారులు
షరతుల ఎవుసంలో సర్కారు ఇచ్చిన సోయా విత్తనాలు మొలకెత్తలేదు. ప్రభుత్వం పంపిణీ చేసిన సబ్సిడీ విత్తనాలు వేసిన 60 శాతం భూముల్లో మొలకలు రాలేదు. ఒకే లాట్‌కు చెందిన విత్తనాలు కొన్నిచోట్ల మొలకెత్తితే, మరికొన్ని చోట్ల అసలు మొలకలు రాకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనే లక్షకుపైగా ఎకరాల్లో రైతులు నష్టపోయారు. అయితే, ప్రైవేటు కంపెనీల విత్తనాలు బాగా మొలకెత్తడంతో అధికారులు ఆత్మరక్షణలో పడ్డారు. ప్రభుత్వానికి చెప్పి మళ్లీ సీడ్స్ ఇప్పించేలా చూస్తామని చెబుతున్నారు. కాగా, ట్రాక్టర్, కూలీల రూపంలో పెద్దమొత్తంలో నష్టపోయామంటున్న రైతులు, తమకు పరిహారంతోపాటు నాణ్యమైన విత్తనాలు వ్వాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డెక్కి ఆందోళన బాట పడుతున్నారు.
నాలుగున్నర లక్షల ఎకరాల్లో సాగు
షరతుల సాగులో భాగంగా ఈ ఖరీఫ్‌లో తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల 50 వేల ఎకరాల్లో సోయా పండించాలని అధికారులు నిర్ణయించారు. ముఖ్యంగా ఈ పంట ఎక్కువగా పండే ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకే ఎక్కువ టార్గెట్ ఇచ్చారు. మొత్తంగా లక్షా 48 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. కానీ, ఇప్పటిదాకా సర్కారు కేవలం 76 వేల క్వింటాళ్లు ఇచ్చింది. వాటిని రైతులకు పంపిణీ చేశారు. ఇటీవల తొలకరి వర్షాలకు 50 శాతం మంది రైతులు భూముల్లో సోయా విత్తనాలు వేశారని అధికారులు చెబుతున్నారు. అందులో 60 శాతం వరకు సీడ్స్ మొలకెత్తలేదు. దీంతో ఆందోళన చెందిన మిగతా రైతులు విత్తనాలనుపక్కనపెట్టేశారు.
జిల్లాలవారీగా ఇదీ పరిస్థితి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని లక్షా 88 వేల ఎకరాల్లో సోయా సాగుచేయాలని ఆఫీసర్లు టార్గెట్ పెట్టారు. 80 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉండగా, 32 వేల క్వింటాళ్ల విత్తనాలు మాత్రమే వచ్చాయి. అందులోనూ 60 శాతం విత్తనాల్లో జర్మినేషన్ సమస్య వచ్చింది. ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో 50 వేలకు పైగా ఎకరాల్లో రైతులు నష్టపోయారు. కామారెడ్డి జిల్లాలోని 1.02 లక్షల ఎకరాల్లో సోయా సాగుచేయాలని నిర్ణయించగా, 30 వేల క్వింటాళ్ల సీడ్ అవసరముంటుందని అంచనా వేశారు. ఇప్పటివరకు 14 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. 40 వేలకుపైగా ఎకరాల్లో సాగుచేయగా 20 శాతం వరకు జర్మినేషన్ సమస్య వచ్చినట్టు ఆఫీసర్లు చెబుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో 20 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరముండగా, ఇప్పటివరకు 16 వేల క్వింటాళ్లు వచ్చాయి. సంగారెడ్డి జిల్లాలో 16 వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరముంటుందని అంచనా వేయగా, 12 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఇక్కడకూడా జర్మినేషన్ సమస్య ఉండడంతో ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. జగిత్యాల, మెదక్ జిల్లాల్లోనూ ఇవే సమస్యలున్నాయి.
పెట్టుబడి పోయింది
ఒకసారి ఒక ఎకరంలో విత్తనాలు వేయాలంటే ట్రాక్టర్‌తో దున్నడానికి, కూలీలకు కనీసం రూ.5 వేలు ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఇప్పుడు మొలకలు రాకపోవడంతో మరోసారి విత్తుకోవాలంటే మరో రూ.5 వేల చొప్పున ఖర్చు చేయాలని అంటున్నారు. సమస్య తీవ్రంగా ఉన్న ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్జిల్లాలో పాత విత్తన ప్యాకెట్లు తీసుకొచ్చే రైతులకు కొత్త ప్యాకెట్లు ఇస్తామని ఆఫీసర్లు చెబుతున్నారు. ఆదిలాబాద్‌లో ఇప్పటికే అది మొదలైంది. విత్తనాలు అవసరం లేదనేవారికి డబ్బులు వాపస్ ఇస్తున్నారు. అయితే, విత్తనాలు ఆల్రెడీ వేసి నష్టపోయిన తమ సంగతేంటని బాధిత రైతులు ప్రశ్నిస్తున్నారు. తమకు ఎకరానికి రూ.10 వేల పరిహారంతో పాటు నాణ్యమైన విత్తనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
నీళ్లు అందనివి మొలకెత్తలేదు
సబ్సిడీ విత్తనాలు తీసుకెళ్లిన చాలామంది రైతులు వర్షాలు కురవకముందే వేస్తున్నారు. తర్వాత వర్షాలు లేకపోవడంతో కొందరు రైతులు నీళ్లు పెట్ట లేదు. అందువల్లే చాలాచోట్ల మొలకెత్తడంలేదు. విత్తనాలు సరిగ్గా లేకుంటే ఒకే లాట్‌కు చెందినవి కొన్నిచోట్ల మొలకెత్తి, మరికొన్నిచోట్ల ఎందుకు మొలకెత్తవు.
– వెంకట్, ఇన్చార్జి డీఏవో, ఆదిలాబాద్

