
న్యూఢిల్లీ: తయారీ సమస్యల కారణంగా భారతీయ ఫార్మా కంపెనీలు గ్లెన్‌మార్క్, అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్, సన్ ఫార్మా అమెరికాలో తమ ఉత్పత్తులను రీకాల్ చేసుకుంటున్నాయి. యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ప్రకారం, ముంబైకు చెందిన గ్లెన్‌మార్క్ హార్ట్ ఫెయిల్యూర్, హై బీపీ చికిత్సలో వాడే కార్వెడిలోల్ టాబ్లెట్లు 55,560, అదనంగా 17,496 బాటిళ్లను రీకాల్ చేస్తోంది.
ఈ మెడిసిన్స్‌లో ఎఫ్‌డీఏ పరిమితికి మించి నైట్రోసమైన్ మలినాలు ఉన్నాయని గుర్తించారు. అలాగే థియోఫిలైన్ టాబ్లెట్లు (400 ఎంజీ) 22,656 బాటిళ్లు కూడా వెనక్కి తీసుకుంటోంది. అలెంబిక్ ఫార్మా నిద్రలేమికి ఉపయోగించే డోక్సెపిన్ హైడ్రోక్లోరైడ్ క్యాప్సూల్స్ 9,492 బాటిళ్లు రీకాల్ చేసింది.
ఇందులోనూ నైట్రోసమైన్ మలినాలు ఉన్నాయని యూఎస్ ఎఫ్‌డీఏ తెలిపింది. సన్ ఫార్మా హై బీపీ చికిత్సలో వాడే స్పిరోనోలాక్టోన్ టాబ్లెట్లు 11,328 బాటిళ్లను రీకాల్ చేస్తోంది. వీటిలో అల్యూమినియం అనే ఎక్స్‌టర్నల్ ఎలిమెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఎఫ్‌డీఏ ప్రకారం, క్లాస్ 2 రికాల్ అనేది తాత్కాలిక లేదా వైద్యపరంగా తిరిగి కోలుకునే ఆరోగ్య సమస్యలకు కారణమయ్యే ఉత్పత్తులపై అమలవుతుంది.