భారత్ మాటవినని ఎక్స్.. @Global Affairs ఖాతా నిలిపివేత, ఏమైందంటే..?

భారత్ మాటవినని ఎక్స్.. @Global Affairs ఖాతా నిలిపివేత, ఏమైందంటే..?

Global Affairs X Account: వాస్తవానికి భారత ప్రభుత్వం ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ ఎక్స్ లోని దాదాపు 8000 ఖాతాలను బ్లాక్ చేయాలని కోరింది. అయితే ప్రభుత్వం కోరినట్లు చేస్తే తమపై భారీగా పెనాల్టీలు పడతాయని, స్థానికంగా పనిచేస్తున్న ఉద్యోగులు జైలుకు వెళ్లే అవకాశం కూడా ఉంటుందని పేర్కొన్న ఎక్స్ ప్రభుత్వ విజ్ఞప్తిని నిరాకరించింది. 

భారత ప్రభుత్వం తమను కొన్ని అంతర్జాతీయ వార్తా సంస్థలు, ప్రముఖులకు చెందిన ట్విట్టర్ ఖాతాలను ఇండియాలో బ్యాన్ చేయాలని కోరిందని, అయితే అలా చేయటం కుదరదని తేల్చి చెప్పినట్లు తన @Global Affairs ఖాతాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే సదరు ఖాతాను ఇండియాలో నిలిపివేయటం గమనార్హం. ప్రభుత్వం కోరిన లీగల్ డిమాండ్ కారణంగా తమ ఖాతాను ప్రస్తుతం ఇండియాలో నిలిపివేస్తున్నట్లు అక్కడ పేర్కొనబడింది. 

ఎక్స్ ప్రకారం భారత ప్రభుత్వం 8000 ఖాతాలను పూర్తిగా బ్లాక్ చేయమనటం ఒకవిధంగా సెన్సార్షిప్ లాంటిదని ఆందోళన వ్యక్తం చేసింది. అయితే చాలా వాటిలో ప్రభుత్వం తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులకు సంబంధించిన వివరాలను పంచుకోలేదని, ఖాతాలను ఎందుకు నిలిపివేయాలనే దాని గురించి తమకు అవసరమైన మేరకు వివరాలను భారత ప్రభుత్వం ఇవ్వలేదని కూడా ఎక్స్ ఆరోపించింది. 

భారత ప్రభుత్వం కోరినట్లుగా ఖాతాలను నిలిపివేస్తే అది భారతీయ యూజర్లకు ఇబ్బంది కలిగిస్తుందని వెల్లడించింది. అయితే ఈ ఖాతాలు ప్రపంచ వ్యాప్తంగా ఇతరదేశాల్లో ప్రజలు చూసేందుకు అందుబాటులోనే ఉంటాయని తెలిపింది. ఈ చర్యలు అనవరసమైనవని, ఈ చర్యలు వాక్ స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని సమర్థించుకుంది. ఇదే క్రమంలో భారత విజ్ఞప్తిపై అవసరమైన చర్యలను తీసుకునేందుకు న్యాయపరమైన మార్గాలను అన్వేషిస్తున్నట్లు ఎక్స్ వెల్లడించటం గమనార్హం.