తెలంగాణ కళా వారసత్వానికి చిరస్మరణీయ గుర్తింపుగా నిలిచిన నిర్మల్ కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించాయి. అయితే ఈ కళలకు ప్రాణాధారమైన పొనికి చెక్క కొరతతో కళాకారుల భవిష్యత్తుపై ఆందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో చేపట్టిన ‘పొనికి వనం’ కార్యక్రమం కళాకారుల్లో కొత్త ఆశలు నింపుతోంది. ముడిసరుకు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే కాకుండా.. శతాబ్దాల చరిత్ర కలిగిన నిర్మల్ కళల పరిరక్షణకు ఈ హరిత యజ్ఞం బలమైన పునాదిగా మారుతోంది.
చెక్క ముక్కకు కళాకారుడి చేతి స్పర్శ తగిలితే చాలు.. అది అందమైన బొమ్మగా తయారవుతుంది. అలాంటి అద్భుత కళాఖండాలే నిర్మల్ బొమ్మలు. ఈ బొమ్మలు తెలంగాణ కళా వైభవానికి ప్రతీకగా నిలుస్తూ, ప్రపంచవ్యాప్తంగా నిర్మల్ పేరును చాటుతున్నాయి. తెలంగాణకు చెందిన అత్యంత ప్రసిద్ధ హస్తకళల్లో భాగమైన ఈ నిర్మల్ బొమ్మలను తేలికపాటి పొనికి చెక్కతో తయారు చేస్తారు. వివిధ జంతువులు, పక్షులు, గ్రామీణ జీవితం, పురాణ పాత్రలు.. ఇలా ఒకటేంటి పలు ప్రధాన ఇతివృత్తాలతో ప్రతి బొమ్మ చేతితోనే తయారవుతుంది.
కొయ్య బొమ్మల తయారీ ఇలా...
నిర్మల్ బొమ్మలను తయారుచేసేందుకు చెక్క కోసం పొనికి కర్రను తీసుకొచ్చి, దాన్ని ముక్కలుగా చేసి బొమ్మగా మలుస్తారు. చిన్న చిన్న చెక్క ముక్కలను కావాల్సిన రీతిలో చెక్కి చింతగింజల పిండితో తయారుచేసిన జిగురుతో ఆ బొమ్మలకు అతికించి దానికొక రూపం తీసుకొస్తారు. ఆ తర్వాత బొమ్మను ఎండలో ఆరబెట్టి రంగులు వేస్తారు. ఈ కళాకారులు తయారుచేసే బొమ్మల్లో జంతువులు, కూరగాయలు, పండ్లు, పక్షులు లాంటివెన్నో ఉంటాయి.
పెయింటింగ్స్ కూడా..
కొయ్య బొమ్మలే కాదు.. నిర్మల్ పెయింటింగ్స్ కూడా ఎంతో జనాదరణ పొందాయి. యుద్ధరంగంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసే గీతాబోధన, గంధర్వ కన్య, ప్రకృతి రమణీయత, దేవతల చిత్రాలు.. ఇలా ఎన్నో పెయింటింగ్స్‌కు కళాకారులు రూపకల్పన చేశారు. ఆ చిత్రాల్లో సహజత్వం ఉట్టిపడుతుంది. కళ్లను కట్టిపడేసే ఈ చిత్రాలను బహుమతులుగా ఇచ్చేందుకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.
కొయ్యబొమ్మలకు జీఐ ట్యాగ్
పురాతన నిర్మల్ కొయ్యబొమ్మలకు జీఐ ట్యాగ్ (భౌగోళిక సూచిక) లభించడంతో దీని ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. పొనికి చెక్కతో మాత్రమే తయారుచేసే నిర్మల్ బొమ్మలు, పెయింటింగ్స్‌కు ప్రత్యేక గుర్తింపు లభించింది. నిర్మల్ జిల్లాలో పొనికి చెట్లు ఎక్కువగా పెరిగే అడవులు కళాకారుల జీవనోపాధికి కూడా ఆధారంగా నిలుస్తున్నాయి.
కొయ్య బొమ్మలు, నిర్మల్ పెయింటింగ్స్ తయారీలో ఉపయోగించే తేలికపాటి కలప ఈ చెట్ల నుంచే వస్తుంది. దీంతో ఈ వనాలకు చారిత్రక, ఆర్థిక ప్రాధాన్యం ఏర్పడింది. పొనికి చెట్లకు వేగంగా పెరిగే స్వభావం ఉండటంతోపాటు కళాఖండాల తయారీకి అనువైన, మృదువైన కలపను అందిస్తాయి. ఒకప్పుడు నిర్మల్ పరిసర అడవుల్లో విస్తారంగా కనిపించిన ఈ చెట్ల సంఖ్య క్రమంగా తగ్గిపోయింది.
పొనికి వనాల పెంపు ఆలోచన...
నిర్మల్ జిల్లాకు అతిథులు ఎవరు వచ్చినా వారికి నిర్మల్ కొయ్యబొమ్మలు లేదా పెయింటింగ్‌ను బహుమతిగా అందజేయడం సర్వసాధారణంగా మారింది. నిర్మల్ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కొత్తపల్లి విజయలక్ష్మీ ఒకసారి నిర్మల్ టాయ్స్ అండ్ ఆర్ట్స్ సహకార సంఘాన్ని సందర్శించారు. బొమ్మల తయారీకి వాడే పొనిక చెక్క కొరత వల్ల తాము అవస్థలు పడుతున్నట్లు హస్తకళాకారులు చెప్పడంతో ఈ సమస్య తీర్చేందుకు అటవీ స్థలాల్లో పొనికి ప్లాంటేషన్ పెంచాలని నిర్ణయించుకున్నారు.
నిర్మల్ కళాకారులకు ప్రధాన ముడిసరుకైన పొనికి చెక్క కొరత సమస్యను గుర్తించిన డైరెక్టర్ కె. విజయలక్ష్మీ సంబంధిత శాఖల సమన్వయంతో పెద్దఎత్తున పొనికి మొక్కల పెంపకానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కలెక్టర్లుగా పనిచేసిన వరుణ్ రెడ్డి, అభిలాష అభినవ్‌ల సహకారంతో పొనికి చెట్ల నుంచి టిష్యూకల్చర్ సాయంతో మొక్కలు పెంచారు.
అయితే కేవలం వంద మొక్కలు పెంచగలిగారు. దీంతో పొనికి మొక్కలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్నాయని అటవీశాఖ అధికారులు అందించిన సమాచారంతో అక్కడి నుంచి 5 వేల మొక్కలను తెప్పించి మామడ మండలం లింగాపూర్, జగదాంబ తండాల్లో నాటించారు.
‘‘ఏడాది క్రితం నాటిన పొనికి మొక్కలు పది అడుగుల ఎత్తుకు ఎదిగాయి. ఈ వనం ద్వారా ఒకవైపు నిర్మల్ కళల మనుగడకు భరోసా లభిస్తుండగా, మరోవైపు పచ్చదనం పెంపు, జీవవైవిధ్య పరిరక్షణకు కూడా దోహదపడుతోంది” ఆమె చెప్పారు. ఈ కార్యక్రమం గ్రామీణాభివృద్ధి, కళాకారుల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ అనే మూడు లక్ష్యాలను ఒకేసారి నెరవేర్చుతోందని ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
పొనికి వనాల పెంపకానికి డీఆర్‌డీఏ కృషి
నిర్మల్ కళాకారులకు ప్రధాన ముడిసరుకైన పొనికి చెక్క భవిష్యత్‌లో కొరత రాకుండా ఉండేందుకు జిల్లాలోని అడవుల్లో భూసార పరీక్షలు చేసి ఈ చెట్లు పెరిగే అవకాశమున్న అనుకూల ప్రాంతాలను గుర్తించి పెద్దఎత్తున మొక్కలను నాటించడం, వాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టింది డీఆర్‌డీఏ. కళలకు జీవనాడిగా భావించే పొనికి చెట్ల సంరక్షణ, విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టిసారించింది.
నిర్మల్ కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్ కళలకు ప్రాణాధారమైన పొనికి చెట్ల సంరక్షణ కోసం చేపట్టిన ‘పొనికి వనం’ కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి ప్రశంసలు దక్కాయి. నిర్మల్ జిల్లాలో పొనికి వనాల అభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపిన అధికారుల కృషిని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందించారు. కళా వారసత్వ పరిరక్షణతో పాటు పర్యావరణ సంరక్షణను మేళవించిన ఈ ప్రోగ్రామ్ రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోందని సీఎం పేర్కొన్నారు.
నిజాం నవాబును ఆకర్షించిన నిర్మల్ బొమ్మలు
నిజాం నవాబు ఒకసారి నిర్మల్ పట్టణాన్ని సందర్శించేందుకు వచ్చిన సమయంలో ఆయనకు సకల లాంఛనాలతో స్వాగతం పలికి కోటలోకి ఆహ్వానించారు. నవాబు సింహాసనంపై కూర్చోగానే పై నుంచి పూలవర్షం కురిసింది. అవి మామూలు పూలు కావు. అచ్చంగా బంగారు పువ్వులను తలపించేలా నిర్మల్ కళాకారులు రూపొందించిన చెక్క పుష్పాలు. వాటిని చూసి నిజాం నవాబు ముచ్చటపడ్డాడని అంటారు.
సవాళ్లెన్నో...
తెలంగాణకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన నిర్మల్ కొయ్య బొమ్మలు, పెయింటింగ్స్ ప్రస్తుతం అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఒకప్పుడు రాజులు, జమీందారుల ఆదరణతోపాటు దేశవ్యాప్తంగా డిమాండ్ పొందిన ఈ కళారూపాలు నేడు ఆధునిక మార్కెట్ పోటీ, తగ్గుతున్న కళాకారుల సంఖ్య, పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులతో మనుగడ కోసం పోరాడుతున్నాయి.
నిర్మల్ కళాకృతుల తయారీలో నైపుణ్యం కలిగిన సంప్రదాయ కళాకారుల కుటుంబాలు క్రమంగా ఇతర ఉపాధి మార్గాలవైపు మళ్లుతున్నారని నిర్మల్ కొయ్య బొమ్మల పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు సముద్రాల పెంటయ్య చెప్పారు. దీనికితోడు యువత ఈ రంగంలోకి రావడానికి ఆసక్తి చూపకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.
చేతితో తయారయ్యే ఈ కళాఖండాలకు సమయం ఎక్కువ పట్టడం, ఆదాయం తక్కువగా ఉండటం ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు. ‘మేం పది గంటలు పనిచేసినా మాకు కేవలం రూ. 500లే వస్తున్నాయని కళాకారుడు ఎన్. రాజశేఖర్ చెప్పారు.
నిర్మల్ కళకు కొత్త ఊపిరి
ప్లాస్టిక్, ఫైబర్, మెషిన్ తయారీ అలంకార వస్తువులు తక్కువ ధరలకు అందుబాటులో ఉండటంతో నిర్మల్ బొమ్మల మార్కెట్ దెబ్బతింటోందని నిర్మల్ కొయ్యబొమ్మల పారిశ్రామిక సహకార సంఘం మేనేజర్ బ్రహ్మరేతు శంకర్ ఆవేదనగా చెప్పారు. ప్రభుత్వం తమకు ఇళ్ల స్థలాలు ఇచ్చినా అవి దక్కలేదన్నారు. కానీ పొనికి వనాల పెంపకానికి ప్రభుత్వ ప్రోత్సాహం అందించడం, జీఐ ట్యాగ్ గుర్తింపు, పర్యాటక రంగంతో అనుసంధానం, కొత్త డిజైన్ల రూపకల్పన వంటి చర్యలు నిర్మల్ కళకు కొత్త ఊపిరి పోస్తాయి అన్నారాయన.
నిర్మల్ కళల భవిష్యత్తును కాపాడాలన్న సంకల్పంతో ప్రారంభించిన ‘పొనికి వనం’ కార్యక్రమం జాతీయస్థాయిలో కూడా ప్రశంసలు అందుకుంది. కళాకారుల జీవనాధారాన్ని బలోపేతం చేస్తూనే పర్యావరణ పరిరక్షణకు దోహదపడిన ఈ వినూత్న కార్యక్రమానికి నాయకత్వం వహించిన నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్‌కు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డ్ లభించడం విశేషం.
నిర్మల్ కళల పరిరక్షణకు కీలక అడుగు
ఒకప్పుడు అంతరించిపోతుందేమోనన్న ఆందోళనకు గురిచేసిన నిర్మల్ కళలకు ఇప్పుడు పొనికి వనాల రూపంలో కొత్త భరోసా లభిస్తోంది. కళాకారుల జీవనాధారాన్ని కాపాడుతూ, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహిస్తూ, భావితరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించే దిశగా ఈ కార్యక్రమం ఆదర్శంగా నిలుస్తోంది.
పొనికి చెట్లు పెరిగినంతగా నిర్మల్ కళల ఖ్యాతి కూడా విస్తరించాలని కళాకారులు ఆశిస్తున్నారు. పొనికి వనం నేడు ఒక హరిత కార్యక్రమం మాత్రమే కాదు.. నిర్మల్ కళల మనుగడకు వేసిన భరోసా బాటగా మారింది. హరిత సంరక్షణతో కళా సంరక్షణను మేళవించిన ‘పొనికి వనం’ నిజంగా నిర్మల్ బొమ్మలకు కొత్త ఊపిరి, తెలంగాణ సాంస్కృతిక పర్వానికి శాశ్వత భరోసాగా నిలవనుంది.
నిర్మల్ సంస్థానంలో హస్తకళల అభివృద్ధి
నిర్మల్ సంస్థానాన్ని పాలించిన నిమ్మనాయుడు పద్మనాయక వంశానికి చెందిన వాడు. అప్పట్లో ఆయన దేశం నలుమూలల నుంచి నకాశి కళాకారులను నిర్మల్‍కు రప్పించి హస్తకళలను అభివృద్ధి చేశారు. ఆయన హయాంలో నిర్మల్ పేరు ఖండాంతరాలు దాటింది. ఆయన అనంతరం పాలించిన రాజులు ఈ కుటుంబాలను ఆదుకుని నిర్మల్ కళలు అంతరించిపోకుండా అండగా నిలిచారు. నిర్మల్‍లో కొయ్య బొమ్మల పరిశ్రమ 17వ శతాబ్దిలో ప్రారంభమైనట్లు భావిస్తారు.1955వ సంవత్సరంలో నిర్మల్ కొయ్యబొమ్మల సహకార సంస్థను కళాకారులతో ఏర్పాటు చేశారు.
