సెమీ కండక్టర్ సెక్టార్​లో గ్లోబల్​గా ఎదుగుతం

సెమీ కండక్టర్ సెక్టార్​లో గ్లోబల్​గా ఎదుగుతం
  •      ఆరోజు ఎంతో దూరంలో లేదు: మోదీ
  •     ఈ సెక్టార్​ను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని ఫైర్ 
  •     గుజరాత్, అస్సాంలో సెమీ కండక్టర్ ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన

ధోలెరా/గువాహటి: సెమీ కండక్టర్ సెక్టార్ లో మన దేశం గ్లోబల్ పవర్ గా ఎదుగుతుందని, ఆరోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని మోదీ అన్నారు. రూ.1.25 లక్షల కోట్లతో ఏర్పాటు చేయనున్న మూడు సెమీ కండక్టర్ ప్లాంట్లకు బుధవారం ఆయన వర్చువల్ గా శంకుస్థాపన చేశారు. వీటిలో రెండు గుజరాత్ లో, ఒకటి అస్సాంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. మన దేశాన్ని సెమీ కండక్టర్ల మాన్యుఫాక్చరింగ్ హబ్ గా మారుస్తామన్నారు. 

‘‘మేం రెండేండ్ల కింద సెమీ కండక్టర్ మిషన్ ను ప్రకటించాం. ఆ తర్వాత కొన్ని నెలలకే ప్లాంట్ల ఏర్పాటు కోసం కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాం. ఇయ్యాల మూడు ప్లాంట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం” అని తెలిపారు. సెమీ కండక్టర్ల తయారీలో మన దేశం కొన్ని దశాబ్దాలు వెనుకంజలో ఉన్నదని, ఇకపై ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోబోమని చెప్పారు.

 ‘‘మన దేశం మొదట 1960లోనే సెమీ కండక్టర్ల తయారీపై కలలు కన్నది. కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు. భవిష్యత్తు అవసరాలకు తగినట్టుగా పెట్టుబడులు పెట్టకపోవడంతో ఈ రంగంలో మన దేశం చాలా వెనకబడిపోయింది. అందుకే ఈ రంగంపై మేం ఫోకస్ పెట్టాం. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నాం. మన దేశం కొన్నేండ్ల కింద కన్న కలలను నిజం చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచంలో కొన్ని దేశాలే సెమీ కండక్టర్లను తయారు చేస్తున్నాయి. ఈ రంగంలో మన దేశం కీలక పాత్ర పోషించే స్థాయికి ఎదుగుతుంది” అని ధీమా వ్యక్తం చేశారు. సెమీ కండక్టర్ల తయారీ ప్లాంట్లతో దేశంలో టెక్నాలజీ పరంగా అభివృద్ధి జరగడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. 

పీఎం‑సూరజ్ పోర్టల్ ప్రారంభం.. 

బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక సాయం అందించేందుకు తీసుకొచ్చిన పీఎం–సూరజ్ స్కీమ్ నేషనల్ పోర్టల్ ను బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. దీని కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎంటర్ ప్రెన్యూర్స్ కు లోన్లు అందజేయనున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వ పథకాల్లో ఎక్కువ మంది లబ్ధిదారులు బలహీనవర్గాలైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే అని చెప్పారు. ఈ వర్గాలను గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు.