
ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు అయిన భారతదేశం, బాస్మతీయేతర తెల్ల బియ్యంతో పాటు విదేశీ అమ్మకాలను నిషేధించడంతో ఈ ప్రభావం ఇతర దేశాలపై పడనున్నట్టు తెలుస్తోంది. కొవిడ్ మహమ్మారి, ఉక్రెయిన్ యుద్ధం, ఎల్ నినో లాంటి పలు పరిణామాల క్రమంలో బియ్యం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలపై ఇది అత్యంత ప్రభావం చూపునుంది. అంతే కాకుండా దీని వల్ల ఆహార అభద్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులను భారతదేశం నిషేధించనుందని, ఇది దాని మొత్తంలో నాలుగింట ఒక వంతు వాటాను కలిగి ఉందని వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది తగినంత లభ్యతను నిర్ధారిస్తుందని, దేశీయ మార్కెట్‌లో ధరల పెరుగుదలను తగ్గిస్తుందని రీసెంట్ ఇచ్చిన ఒక ప్రకటనలో తెలిపింది.
గ్లోబల్ రైస్ షిప్‌మెంట్‌లలో 40 శాతానికి పైగా భారతదేశం వాటాను కలిగి ఉంది. కాబట్టి ఈ నిర్ణయం బియ్యం దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలలో ఆహార అభద్రతను పెంచే ప్రమాదం ఉంది అని డేటా అనలిటిక్స్ సంస్థ గ్రో ఇంటెలిజెన్స్ ఒక నోట్‌లో పేర్కొంది. నిషేధం ద్వారా తీవ్ర పరిణామాలుంటాయని భావిస్తున్న దేశాలలో ఆఫ్రికన్ దేశాలు, టర్కీ, సిరియా, పాకిస్తాన్ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇప్పటికే అధిక ఆహార-ధరల ద్రవ్యోల్బణంతో పోరాడుతున్నాయని సంస్థ తెలిపింది.
రెండవ త్రైమాసికంలో బాస్మతీయేతర వైట్ రైస్ ఎగుమతులు సంవత్సరానికి 35 శాతం పెరిగాయని మంత్రిత్వ శాఖ తెలపగా.. సెప్టెంబరులో ప్రభుత్వం విరిగిన బియ్యం రవాణాను నిషేధించి, తెల్ల బియ్యంపై 20 శాతం ఎగుమతి పన్ను విధించిన తర్వాత కూడా ఈ పెరుగుదల నమోదైందని వెల్లడించింది. ధరలను అదుపు చేసేందుకు భారత్ ఇప్పటికే గోధుమలు, చక్కెర ఎగుమతులను గతేడాది అరికట్టింది.