- 2047నాటికి అగ్రి ఎకానమీని 400 బిలియన్ డాలర్లకు పెంచడమే టార్గెట్: మంత్రి తుమ్మల
హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో డిజిటల్, స్మార్ట్‌లాంటి లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంలాంటి విప్లవాత్మక మార్పులకు గ్లోబల్ సమిట్ దిక్సూచిగా నిలుస్తుందని అగ్రికల్చర్, బ్యాంకింగ్, వాణిజ్య నిపుణులు పేర్కొన్నారు. అగ్రికల్చర్ డెవలప్‌మెంట్, ఎక్స్‌పోర్ట్ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తే సుస్థిర అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు.
సోమవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్-–2025లో భాగంగా ‘‘రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ (రేర్) స్ట్రాటజీ – వాల్యూ చైన్ ద్వారా రైతుల ఆదాయం పెంపు’’ అనే అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా - ప్యానెలిస్టులు మాట్లాడుతూ.. అగ్రికల్చర్ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని పేర్కొన్నారు.
మలేసియా, థాయ్‌లాండ్ దేశాలు ఫుడ్ ఎక్స్‌పోర్ట్స్ ద్వారా మంచి అభివృద్ధి సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అధిక విలువ కలిగిన పంటల సాగులో వైవిధ్యీకరణ,-- డిజిటల్ సాగు, డ్రోన్లు, ఫామ్ మెకనైజేషన్ టెక్నాలజీలతోపాటు మార్కెట్ లింకేజీలు, ఇంట్రేడింగ్ బలోపేతం చేయాలని సూచించారు.
ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, గోదాంలు, కోల్డ్ స్టోరేజ్, లాజిస్టిక్స్ వ్యవస్థలు మెరుగుపరచాలన్నారు.- ఎఫ్‌పీవోలు, ఎస్‌హెచ్‌జీలు, సొసైటీలు, అగ్రి స్టార్టప్‌ల బలోపేతం,- నేచురల్ ఫార్మింగ్ ప్రోత్సాహంలాంటి వంటి అంశాలు ప్రధానంగా చర్చించారు. తెలంగాణ ప్రభుత్వానికి రైతుల పట్ల ఉన్న నిబద్ధతకు సమిట్ నిదర్శనమని, ఇలాంటి సదస్సులు వ్యవసాయ రంగ అభివృద్ధికి కీలకమని నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా, తెలంగాణ వ్యవసాయ రంగానికి గ్లోబల్ సమిట్ చర్చలు మార్గదర్శకంగా ఉంటాయని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.
ప్రస్తుతం తెలంగాణ వ్యవసాయం, అనుబంధ ఆర్థిక వ్యవస్థ 34.6 బిలియన్ డాలర్లుగా ఉందని, 2047 నాటికి దీన్ని 400 బిలియన్ డాలర్లకు పెంచాలన్నది తమ దీర్ఘకాలిక లక్ష్యమని తెలిపారు. గత రెండేండ్లలో ఉచిత విద్యుత్ మినహా.. రైతు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలకు లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టినట్టు వెల్లడించారు. ఈసెషన్‌కు ప్యానెలిస్టులుగా వ్యవహరించిన వారికి తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, రైతు కమిషన్ అధ్యక్షుడు కోదండ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
