- 210 దేశాల్లోని 2,500 ప్రాంతాల్లో సామూహిక ఆసనాలు
- కోల్‌కతా రెడ్ రోడ్‌పై వేలాది మందితో కలిసి యోగాసనాలు వేసిన ప్రధాని మోదీ
- శారీరక, మానసిక దృఢత్వానికి యోగానే మార్గమని వెల్లడి
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత్‌తోపాటు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 210కి పైగా దేశాల్లోని 2,500 ప్రాంతాల్లో యోగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. విదేశాల్లోని భారత రాయబార కార్యాలయాల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో భాగంగా అమెరికాలోని లింకన్ మెమోరియల్, యూఎన్‌వోతో పాటు బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా, చైనా, రష్యా సహా పలు దేశాల్లోని చారిత్రాత్మక వేదికలపై వందలాది మంది యోగాసనాలు వేశారు. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లో మొదటిసారి స్థానిక మహిళా ఇన్‌స్ట్రక్టర్ల నేతృత్వంలో ఈ వేడుకలు జరగడం విశేషం.
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని చారిత్రాత్మక రెడ్ రోడ్ వేదికగా నిర్వహించిన ప్రధాన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. బెంగాల్ గవర్నర్ ఆర్ఎన్ రవి, కేంద్ర మంత్రి ప్రతాప్‌రావ్ జాదవ్‌తోపాటు వేలాది మంది ప్రజలతో కలిసి ప్రధాని సామూహికంగా యోగాసనాలు వేశారు. దేశవ్యాప్తంగా అన్నిచోట్లా పార్టీలకతీతంగా యోగా డేను నిర్వహించారు.
