ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలి :  బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి

ప్రభుత్వ భూముల వేలం నిలిపేయాలి :  బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి

హనుమకొండ, వెలుగు: కాకతీయ అర్బన్ డెవలప్​మెంట్ అథారిటీ ప్రభుత్వ భూముల వేలంపాటను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూములను కాపాడాలని డిమాండ్ తో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు 'కుడా' ఆఫీస్ ను ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో హనుమకొండ పోలీసులు అడ్డుకోగా కుడా ఆఫీస్ ఎదుట బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మారెడ్డి, ఇతర నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అనంతరం వారిని పోలీసులు అరెస్టు చేసి హనుమకొండ స్టేషన్​కు తరలించారు. ఈ సందర్భంగా పద్మారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ భూములను కాపాడాలని నినదిస్తే అక్రమ అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. హనుమకొండ నడిబొడ్డున ఉన్న ప్రభుత్వ భూముల వేలానికి వరంగల్ వెస్ట్  ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. భూముల వేలం నోటిఫికేషన్​ను రద్దు చేయకపోతే మున్ముందు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు చాడ స్వాతిరెడ్డి, కందగట్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.