నీట్ రీఎగ్జామ్‌‌‌‌.. తగ్గిన హాజరు పరీక్ష రాయడానికి ఆసక్తి చూపని విద్యార్థులు

నీట్ రీఎగ్జామ్‌‌‌‌.. తగ్గిన హాజరు పరీక్ష రాయడానికి ఆసక్తి చూపని విద్యార్థులు
  • గతంతో పోలిస్తే 8.55% తగ్గుదల
  •     రాష్ట్రంలో 7,972, దేశవ్యాప్తంగా 2.79 లక్షల మంది గైర్హాజరు 
  •     ఫిజిక్స్ వెరీ టఫ్.. బయాలజీ కొంచెం ఈజీ
  •     ఫ్లష్ ట్యాంకులో ఫోన్ దాచి, దొరికిపోయిన విద్యార్థి 
  •     కొంపముంచిన గూగుల్ మ్యాప్.. ఎస్ఐ కాళ్లు పట్టుకున్న తండ్రి 
  •     ఇద్దరు అభ్యర్థులను సకాలంలో సెంటర్లకు చేర్చిన పోలీసులు  
  •     ఎగ్జాం నిర్వహణపై కంట్రోల్ రూం నుంచి మంత్రి దామోదర పర్యవేక్షణ   

హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/మేడ్చల్/రంగారెడ్డి/వెలుగు:  దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ యూజీ–2026 పేపర్ లీకేజీ వివాదం తర్వాత, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆదివారం నిర్వహించిన రీఎగ్జామ్ రాష్ట్రంలో ప్రశాంతంగా ముగిసింది. అయితే, ఈసారి విద్యార్థులు నీట్ రాయడంపై పెద్దగా ఆసక్తి చూపలేదని గణాంకాలు చెబుతున్నాయి. మొదటి విడత పరీక్షతో పోలిస్తే ఈసారి అభ్యర్థుల హాజరు శాతం గణనీయంగా పడిపోయింది. తెలంగాణ వ్యాప్తంగా 24 జిల్లాల్లో 208 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు సగటున 89.09 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. రాష్ట్రంలో నీట్ రీఎగ్జామ్ కోసం మొత్తం 73,059 మంది రిజిస్టర్ చేసుకోగా, 65,087 మంది పరీక్షకు హాజరయ్యారు. 

మిగతా 7,972 మంది గైర్హాజరయ్యారు. జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అత్యధికంగా 91.54 శాతం, సూర్యాపేట జిల్లాలో అత్యల్పంగా 84.03 శాతం హాజరు నమోదైంది. గత (రద్దయిన) పరీక్షకు రాష్ట్రంలో 73,084 మంది రిజిస్టర్ చేసుకోగా, 71,500 మంది హాజరయ్యారు. అంటే.. 97.6 4 శాతం మంది అటెండ్ అయ్యారు. గత పరీక్షతో పోలిస్తే రాష్ట్రంలో ఈసారి దాదాపు 8.55 శాతం మేర హాజరు తగ్గింది. కాగా, గ్రేటర్‌‌‌‌‌‌‌‌ హైదరాబాద్‌‌‌‌లో కూడా నీట్ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్, మేడ్చల్​మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 104 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా 39,841 మందికిగాను 35,755 మంది పరీక్ష రాశారు. 4,086 మంది గైర్హాజరయ్యారు. గత పరీక్ష రద్దు కావడంతో ఈసారి పక్కా ఏర్పాట్లు చేశారు. ప్రతి సెంటర్​వద్ద సెల్‌‌‌‌ ఫోన్ జామర్లు ఏర్పాటు చేశారు. తొలిసారిగా బగ్ డిటెక్టర్లను వినియోగించారు. 

జాతీయ స్థాయిలోనూ తగ్గిన హాజరు 

దేశవ్యాప్తంగా మొత్తం 22,74,702 మంది అభ్యర్థులకుగాను 19,95,527 మంది పరీక్షకు హాజరయ్యారు. సుమారు 2.79 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు దూరంగా ఉన్నారు. జాతీయ సగటు హాజరు 87.7 శాతానికే పరిమితమైంది. గత (రద్దయిన) ఎగ్జామ్‌‌‌‌కు 22,75,011 మంది రిజిస్టర్ చేసుకోగా, 22,05, 035 మంది హాజరయ్యారు. అంటే.. 96.92 శాతం మంది మాత్రమే గైర్హజరయ్యారు. గతంలో పోలిస్తే.. ఈ సారి ఏకంగా 9.22 శాతం హాజరు తగ్గింది.  

ఫిజిక్స్ వెరీ టఫ్.. బయాలజీ పర్లేదు 

ఈసారి నీట్ ప్రశ్నపత్రం విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేసింది. సబ్జెక్ట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం.. పేపర్ మీడియం నుంచి టఫ్‌‌‌‌గా ఉంది. ముఖ్యంగా ఫిజిక్స్ విభాగం విద్యార్థులకు చుక్కలు చూపించింది. దాదాపు 60–70 శాతం ప్రశ్నలు సుదీర్ఘమైన గణిత లెక్కలు, అప్లికేషన్ ఆధారితంగా రావడంతో సమయం సరిపోలేదని అభ్యర్థులు వాపోయారు. కెమిస్ట్రీలో కూడా అసెర్షన్–రీజనింగ్ తరహా ప్రశ్నలు ట్రిక్కీగా రావడంతో విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. అయితే, బయాలజీ విభాగం మాత్రం విద్యార్థులకు పెద్ద ఊరటనిచ్చింది. బోటనీ, జూవాలజీ ప్రశ్నలు పూర్తిగా ఎన్‌‌‌‌సీఈఆర్‌‌‌‌టీ పుస్తకాల నుంచే రావడంతో స్కోర్ సాధించడం సులభమని నిపుణులు చెబుతున్నారు. ఈ రీఎగ్జామ్‌‌‌‌కు సంబంధించి ప్రైమరీ కీ జూన్ 28న విడుదల కానుండగా, తుది ఫలితాలు జులై చివరి వారంలో వెలువడే అవకాశం ఉంది.

కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి నిఘా 

హైదరాబాద్‌‌‌‌లోని ఇంటర్మీడియట్ డైరెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ సర్వైలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్‌‌‌‌ను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా సందర్శించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా, బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియపై స్టేట్ కంట్రోల్ రూమ్ ఇంచార్జీలు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్, కేంద్ర విద్యాశాఖ డైరెక్టర్ రవీందర్, డీఐజీ నాయక్‌‌‌‌తో చర్చించారు. పరీక్ష అత్యంత పారదర్శకగా, సురక్షితంగా జరగాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు తీసుకున్న జాగ్రత్తలపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. 

టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో  ఫోన్ దాచి, పట్టుబడ్డ అభ్యర్థి 

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపుర్‌‌‌‌‌‌‌‌మెట్ మండలం రాగన్నగూడా జిల్లా పరిషత్ హైస్కూల్‌‌‌‌లోని సెంటర్‌‌‌‌ లో ఓ అభ్యర్థి టాయిలెట్ ఫ్లష్ ట్యాంకులో ఫోన్ దాచి, పట్టుబడ్డాడు. అచ్చంపేటకు చెందిన ఆ అభ్యర్థి(18) ఉదయం 7 గంటలకే అక్కడికి వచ్చాడు. హైస్కూల్ బిల్డింగ్‌‌‌‌కు కొద్ది దూరంలో ఉన్న టాయిలెట్‌‌‌‌లోని వెంటిలేటర్‌‌‌‌లో మొబైల్ ఫోన్‌‌‌‌ దాచాడు. తర్వాత 11 గంటలకు అతను వాష్‌‌‌‌రూమ్‌‌‌‌లోకి వెళ్లి, ఆ ఫోన్‌‌‌‌ను ఒక జిప్-లాక్ కవర్‌‌‌‌లో పెట్టి, ఫ్లష్ ట్యాంక్‌‌‌‌లో పెట్టాడు. పోలీసులు రెండు సార్లు చెక్ చేసినా, దానిని గుర్తించలేకపోయారు. అయితే, పరీక్ష టైంలో ఆ విద్యార్థి కడుపునొప్పిగా ఉందని చెప్పి, టాయిలెట్‌‌‌‌లోకి వెళ్లాడు. టైం గడుస్తున్నా.. అతడు రాకపోవడంతో అనుమానించిన ఇన్విజిలేటర్లు, భద్రతా సిబ్బంది వెళ్లి చెక్ చేశారు. దీంతో టాయిలెట్‌‌‌‌లో ఫోన్‌‌‌‌లో సమాధానాల కోసం వెతుకుతూ, రెడ్ హ్యాండెడ్‌‌‌‌గా పట్టుబడ్డాడు. గూగుల్ క్రోమ్‌‌‌‌లో అతడు ఆన్షర్ల కోసం సెర్చ్ చేసినట్టుగా గుర్తించారు. ఆ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేసి, ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

 వేరే సెంటర్‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన అభ్యర్థి.. పోలీసుల సాయం  

హాసన్ హష్మీ అనే అభ్యర్థి బొల్లారం కేంద్రీయ విద్యాలయ పరీక్షా కేంద్రానికి బదులుగా పొరపాటున తిరుమలగిరి కేవీ కేంద్రానికి చేరుకున్నాడు. తన సెంటర్ అది కాదన్న విషయం తెలుసుకుని షాక్ అయ్యాడు. తిరిగి వెళ్లేందుకు 10 నిమిషాలే ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. దీంతో అక్కడున్న బొల్లారం ఏసీపీ రమేశ్ కుమార్ తక్షణమే స్పందించారు. హష్మీని తన పోలీస్ వాహనంలో ఎక్కించుకుని, ఏకంగా రాష్ట్రపతి నిలయం గేట్లు తెరిపించి 5 నిమిషాల్లో బొల్లారం కేవీ పరీక్షా కేంద్రానికి చేర్చారు. అలాగే, ఓయూ క్యాంపస్‌‌‌‌లో ఏర్పాటు చేసిన సెంటర్ ఎక్కడుందో‌‌‌‌ తెలియక ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థినిని ఓయూ పోలీస్ స్టేషన్ ఇన్‌‌‌‌స్పెక్టర్ ఎం. మహేశ్ తన వెహికల్‌‌‌‌లో తీసుకెళ్లి సెంటర్ వద్ద దిగబెట్టారు. సకాలంలో సెంటర్‌‌‌‌‌‌‌‌కు చేరుకోవడంతో ఆ విద్యార్థిని టెన్షన్ లేకుండా పరీక్షకు హాజరుకాగలిగింది.   

బిడ్డ కోసం కాళ్లు మొక్కిన తల్లి.. 2 నిమిషాల లేట్‌‌తో ఆశలు ఆవిరి

కొడిమ్యాల, వెలుగు:డాక్టర్ కావాలనే కలతో నెలల తరబడి సిద్ధమైన ఓ విద్యార్థిని ఆశలు.. రెండు నిమిషాల ఆలస్యంతో ఆవిరయ్యాయి. బిడ్డ భవిష్యత్తు కోసం తల్లి కాళ్లు మొక్కి వేడుకున్నా నిబంధనల ముందు కన్నీళ్లు పనిచేయలేదు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామానికి చెందిన నందిని నీట్ పరీక్ష రాయడానికి తన తల్లి దేవవ్వతో కలిసి కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ నీట్ పరీక్ష కేంద్రానికి వచ్చింది. 

మధ్యాహ్నం 1.30లోపు అభ్యర్థులు కేంద్రంలోకి ప్రవేశించాల్సి ఉంది. అయితే నందిని 2 నిమిషాలు ఆలస్యంగా చేరుకోవడంతో అధికారులు లోపలికి అనుమతించలేదు. తన కూతురును లోపలికి పంపాలని సిబ్బంది కాళ్లు పట్టుకుని దేవవ్వ బతిమిలాడింది. కానీ, నిబంధనల ప్రకారం పంపలేమని అధికారులు స్పష్టం చేశారు. దీంతో నందిని పరీక్ష రాయలేకపోయింది. తల్లి, కూతురు ఆవేదన చూసి, అక్కడున్న వారు చలించిపోయారు. 

కొంపముంచిన గూగుల్​మ్యాప్.. 

కీసర అంకిరెడ్డిపల్లిలోని మూర్తి ఇంజినీరింగ్ కాలేజీలో అద్దె ప్రాతిపదికన నడుస్తున్న జ్యోతిబా పూలే గురుకుల స్కూల్, కాలేజీలో నీట్ ఎగ్జామ్ సెంటర్ ఏర్పాటు చేయగా..  స్టూడెంట్ల హాల్ టికెట్‌‌‌‌లపై మూర్తి ఇంజినీరింగ్​కాలేజీ, ఉప్పల్ ఎట్ అంకిరెడ్డిపల్లి కీసర అని ఉంది. దీంతో ప్రణతి యాదవ్ అనే అభ్యర్థి గూగుల్ మ్యాప్‌‌‌‌లో సెర్చ్ చేసి, తండ్రి మల్లేశ్ యాదవ్‌‌‌‌తో కలిసి అక్కడ ఉన్న మూర్తి కాలేజీకి వెళ్లింది. అక్కడికి వెళ్లాక అది ఎగ్జామ్ సెంటర్ కాదని తెలిసింది. మళ్లీ చెక్ చేయగా.. ఏదులాబాద్‌‌‌‌లోని కృష్ణమూర్తి కాలేజీ అని చూపించింది. 

అక్కడికి కూడా వెళ్లాక.. అది కూడా ఎగ్జామ్ సెంటర్ కాదని.. అంకిరెడ్డిపల్లిలోని మూర్తి ఇంజినీరింగ్ కాలేజీలోని బీసీ గురుకుల కాలేజీ అని చెప్పడంతో షాక్ అయింది. టెన్షన్ పడుతూ అక్కడికి వెళ్లినా, టైం అయిపోయింది. తన బిడ్డను లోపలికి పంపాలని వేడుకుంటూ మల్లేశ్ యాదవ్ ఎస్ఐ హరిప్రసాద్ కాళ్లు పట్టుకున్నా.. టైం అయిపోయింది ఏమీ చేయలేమని చెప్పారు. ‘‘హాల్ టికెట్‌‌‌‌పై మూడు ఊర్ల పేర్లున్నాయి. అవి అర్థం కాక కాలేజీ పేరు గూగుల్ మ్యాప్‌‌‌‌లో చూస్తే తప్పడు లొకేషన్ చూపించింది. దీంతో నా బిడ్డ భవిష్యత్ నాశనం అయ్యింది’’ అంటూ అతడు రోదించాడు. అయితే, ఈ సెంటర్ వద్దకు మొత్తం ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి లేటుగా వచ్చారని, టైంలోపు వచ్చిన మిగతా వారందరినీ పంపామని ఎస్ఐ తెలిపారు.