- జార్ఖండ్‌లో నత్వానీకి అవకాశం ఇచ్చి నాకెందుకు ఇవ్వలేదు?
- ఈ విషయాన్ని సమాజానికి తెలిసేలా పోరాడుతా..
- తెలంగాణలో నా కోసం ఎవరూ రాజ్యసభకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు
- ఒకవేళ ఎవరైనా చేసినా నేను ఆ సీటును తీసుకోను.. మధ్యప్రదేశ్‌లోనే నా రాజకీయం
- నా కేసులపై ఇక్కడి కాంగ్రెస్ నేతలు లీకులు ఇచ్చారనేది పచ్చి అబద్ధం
- నాపై మా పార్టీలో ఎలాంటి కుట్ర జరగలేదు.. మేమంతా ఒక్కటే
- ఇది బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం మాత్రమే
హైదరాబాద్, వెలుగు: మధ్యప్రదేశ్‌లో బీజేపీతో రిటర్నింగ్ అధికారి (ఆర్వో) కుమ్మక్కై తన రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ ఆరోపించారు. అక్కడ బీజేపీకి మూడో సీటు గెలుచుకునేందుకు తగిన కోరం కూడా లేదని, అయినా ఆ సీటు కోసం పోటీ చేయడమే పెద్ద కుట్ర అని మండిపడ్డారు. ‘‘మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ సీటు గెలవాలంటే 58 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అవసరం. దీంతో అక్కడ కాంగ్రెస్ మూడో సీటు గెలుస్తుందని బీజేపీకి తెలుసు. డబ్బు, బెదిరింపులతో మూడో సీటును గెలుచుకోలేమని ఆ పార్టీ గుర్తించింది. అందుకే నా విషయంలో బీజేపీతో ఆర్వో లాలూచీపడ్డారు” అని పేర్కొన్నారు. ఆదివారం గాంధీ భవన్‌లో పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్‌తో కలిసి మీనాక్షి నటరాజన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో తన కోసం ఎవరూ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. ఒకవేళ ఎవరైనా రాజీనామా చేసినా తాను ఆ సీటును తీసుకోబోనని చెప్పారు. దీనిపై గత కొన్ని రోజులుగా రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న ప్రచారాన్ని ఆమె పూర్తిగా ఖండించారు. ఇది పచ్చి అబద్ధమని, నిరాధారమైన వార్తలని పేర్కొన్నారు. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళనని, తన రాజకీయం కూడా అక్కడి నుంచే కొనసాగుతుందని స్పష్టం చేశారు. తన కేసుల విషయం అక్కడి బీజేపీ నేతలకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు లీకులు ఇచ్చారనేది పచ్చి అబద్ధమని తెలిపారు. ఆ అవసరం పార్టీలో ఎవరికీ లేదని, తనపై పార్టీలో ఎలాంటి కుట్ర జరగలేదని, తామంతా ఒక్కటేనని చెప్పారు. ఇది బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారం మాత్రమేనని పేర్కొన్నారు.
నాపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు..
తెలంగాణలో తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవని, ప్రైవేట్ వ్యక్తి ఇచ్చిన కేసులో తనకు లీగల్ నోటీసు ఇచ్చారని మీనాక్షి నటరాజన్ తెలిపారు. లీగల్ నోటీసు క్రిమినల్ కేసు ఎలా అవుతుందని ఆమె ప్రశ్నించారు. ‘‘నామినేషన్ పత్రంలో లీగల్ నోటీసు అనే కాలం లేదు. ఓ కేసు అంశాన్ని ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొనలేదనే కారణంతో ఈసీ ఈ నిర్ణయం ఎలా తీసుకుంటుంది” అని ప్రశ్నించారు. లీగల్ నోటీసులు ఎవరికైనా వస్తాయని, తనకు వచ్చిన నోటీసును అర్థం చేసుకోకుండా ఆర్వో తప్పుడు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ‘‘ఫామ్ 26లో ఇలాంటివి నమోదు చేయాల్సిన అవసరం లేదు. ఎఫ్‌ఐఆర్ కాలేదు, పైగా ఆ కేసు 2016 లో జరిగింది. అప్పటికీ నేను తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా బాధ్యతలు చేపట్టక ముందు కేసు అని ఆర్వోకు చెప్పాను’’ అని మీనాక్షి వివరించారు.
తన నామినేషన్ తిరస్కరణ సమయంలో బీజేపీ నేతలను ఎన్నికల ఆఫీసులోకి ఎలా అనుమతించారని ప్రశ్నించారు. అదే తమ పార్టీ నేతలను మాత్రం లోపలికి అనుమతించలేదని, పైగా బీజేపీ నేతలు బెదిరింపులకు దిగారని ఆరోపించారు. జార్ఖండ్‌లో పరిమళ్ నత్వానీకి నామినేషన్ పత్రాల్లో తప్పుల సవరణ కోసం 24 గంటల సమయం ఇచ్చారని, తనకు మాత్రం 2026 రూల్ బుక్‌ను అడ్డంపెట్టుకొని నామినేషన్ పత్రాల్లో సవరణల కోసం ఆ అవకాశం ఇవ్వకుండా తిరస్కరించారని ఆరోపించారు. నామినేషన్ తిరస్కరణతో తానేమీ నిరాశ చెందలేదని, తనపై కేసు ఉందని నామినేషన్‌ను తిరస్కరించలేదని, కేవలం ఎన్నికల సంఘం బీజేపీతో లాలూచీ పడడంతోనే రిజెక్ట్ చేశారని ఆమె స్పష్టం చేశారు. హర్యానాలో కూడా కాంగ్రెస్ సీటును బీజేపీ గెలుచుకుందని అన్నారు.
రాహుల్ వ్యాఖ్యలు నిజమయ్యాయి..
దేశంలో ఓటు, సీటు చోరీ జరుగుతోందని గత రెండేండ్లుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారని మీనాక్షి నటరాజన్ తెలిపారు. తన సీటుతో ఇది మరోసారి రుజువైందని పేర్కొన్నారు. తన సీటు చోరీ జరిగిందని, బీజేపీ చేస్తున్న కుట్రలను సమాజానికి తెలియజేసేందుకే తాము పోరాడుతున్నామని స్పష్టం చేశారు. ఇది ఒక్క సీటుకు సంబంధించిన విషయం కాదని, ఒకే దేశం.. ఒకే ఎన్నిక చేయాలనే కుట్రలో భాగమే అని ఆమె ఆరోపించారు. ‘‘కుంభం శివకుమార్ కేసు సీరియస్ అని గుర్తించే ఆయనకు నారాయణపేట టికెట్ ఇవ్వలేదు.
ఒక వ్యక్తిపై ఆరోపణలు ఉన్నంత మాత్రాన ఆ కుటుంబంలోని వారికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు. పైగా ఆయనపై ఎలాంటి ఆధారాలు నిరూపణ కాలేదు. చార్జ్‌షీట్ లేదని ఆమె చెప్పారు. అయినా నేనెప్పుడూ బాధితుల పక్షమే. పార్టీలో ప్రతి మహిళకు అండగా ఉంటా. శ్రీలతకు కూడా అండగా నిలుస్తా’’ అని ఆమె స్పష్టం చేశారు.
