ఘనంగా 5వరోజు శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు

ఘనంగా 5వరోజు శ్రీరామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు

హైదరాబాద్: శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో శ్రీ భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాలు ఐదవ రోజు ఘనంగా జరిగాయి. తొలుత   పరమేష్ఠి యాగాన్ని నిర్వహించారు. ఈ యాగాన్ని ఐదువేల మంది రుత్వికులు వేద మంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు. పితృదేవతలను తృప్తి కోసం, పితృ దోష నివారణ  కోసం వైభవేష్టి హోమాలను  నిర్వహించారు.

నాలుగు వేదాలలోని మంత్రాలను పఠిస్తూ 114 యాగశాలలో 1035 హోమ హోమ గుండాల్లో ఏకధాటిగా లక్ష్మీనారాయణ మహా క్రతువు ఘనంగా జరిగింది. తీవ్రమైన వ్యాధుల నివారణకు ఈ యాగాన్ని నిర్వహిస్తారని త్రిదండి చిన్న జీయర్ స్వామి తెలిపారు. అనంతరం ప్రవచనం మండపంలో శ్రీరామ అష్టోత్తర శతనామ పూజను  భక్తులు ఆచరించారు. ఈ పూజ ఫలితాన్ని శ్రీ దేవనాథ రామానుజ జీయర్ స్వామి వారు భక్తులకు వివరించారు.
అనంతరం సింహాచలం  స్థానాచార్యులు టివి రాఘవాచార్యులు  భగవద్రామానుజుల వైభవాన్ని తెలియజేశారు. రాజస్థాన్ లోని పుష్కర నుంచి విచ్చేసిన శ్రీ జగద్గురు శ్రీ రామచంద్ర  ఆచార్య హిందీలో అందించారు. సమకాలీన అంశాలను స్పృశిస్తూ రామానుజ స్ఫూర్తి అందించారు. ప్రముఖ తెలుగు వేదకవి  జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు రామనుజాచార్య విశిష్టతను పాటల రూపంలో తెలియచేసారు. ఆ తర్వాత ప్రవచన మండపంలో పలు సంగీత కార్యక్రమాలు జరిగాయి. గాయత్రీరావు అందించిన సంగీత కార్యక్రమాలు దేశభక్తి గీతాలు ఆకట్టుకున్నాయి. గొల్ల శ్రీనివాస్ బృందం నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను కట్టిపడేసింది. పెదప్రోలు భావన బృందం వారి కూచిపూడి నృత్యం అందరినీ విశేషంగా అలరించింది. శ్రీకృష్ణుడిగా జాబిలి అభినయం అందరినీ ఆకట్టుకుంది.

ఐదోరోజు  జరిగిన సాంస్కృతిక    కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.  ప్రజ్ఞ విద్యార్థులతో అవధాన కార్యక్రమం నిర్వహించారు. అమెరికన్ విద్యార్ధులు తమ విశేష ప్రతిభను కనబరిచారు. ప్రజ్ఞ అమెరికా సెక్రటరీ రాజేష్ వారి బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. 
సాయంత్రం ప్రవచన మండపంలో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ శ్రీ త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి సమక్షంలో జరిగింది. అనంతరం శ్రీనివాస్ వీణపై రోణు మజుందార్ వేణువుపై   నిర్వహించిన జుగల్బందీ వీణ వేణు వినోద కార్యక్రమం జరిగింది. చివరగా సముద్రాల మాధవి గారి బృందంచే సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మరో వైపు సమతా మూర్తి ప్రాంగణంలోని 216 అడుగుల భగవద్రామానుజుల విగ్రహాన్ని చూడడానికి భక్తులు విశేషంగా తరలి వచ్చారు. వేలాది మంది భక్తులు ఉదయం నుంచి రాత్రి వరకు విగ్రహాన్ని సందర్శించారు.     
ప్రముఖుల రాక.... 
జనసేన అధినేత, ప్రముఖ సినీ నటుడు పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్ 216 అడుగుల సమతమూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం ప్రవచన భవంతి ప్రాంగణంలో త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలు అందుకున్నారు.  ఈసందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 216 అడుగుల సమతమూర్తి విగ్రహా ఆవిష్కరణతో చిన్న జీయర్  స్వామి వారి సంకల్పం నెరవేరిందన్నారు. ఈ విగ్రహాన్ని ప్రధాని నరేంద్రమోడీ అవిష్కరించటంశుభపరిణామన్నారు. శ్రీ రామనుజాచార్య విగ్రహ ఆవిష్కరణతోభవిష్యత్ తరాలకు సమతా సందేశం అందుతుందన్నారు.                    
హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు  జస్టిస్ పోనగంటి  నవీన్ రావు, జస్టిస్ అభిషేక్ రెడ్డి, ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, టీటీడీ ఈవో జవహర్ రెడ్డి ,సమతమూర్తిని దర్శించుకుని చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనాలు అందుకున్నారు.
రేపటి కార్యక్రమాలు... 
‌దృష్టి దోష నివారణకు వైయ్యూహి కేష్టి యాగం నిర్వహించనున్నారు. వ్యక్తిత్వ వికాసానికి, ఆత్మ జీవనానికి శ్రీ కృష్ణ అష్టోత్తర శతనామావళి పూజ నిర్వహించనున్నారు. వీటితో పాటు ప్రముఖులచే ప్రవచనాలు, విశేషమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి...

ఇండియాలో కొత్త ట్రెండ్.. ఆ కంపెనీలో వీక్లీ శాలరీ

ప్రభుత్వ ఆధిపత్య ధోరణితో ఉద్యోగులకు ఊరట దక్కలేదు

రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి