రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి

రాజ్యాంగాన్ని కాదు..రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చాలి
  • రాజ్యాంగాన్ని మార్చే హక్కు పార్లమెంట్కు కూడా లేదు... కేవలం సవరణలు మాత్రమే చేయవచ్చు.
  • రాజ్యాంగాన్ని రాయడంలో అంబేద్కర్ ఒక్కరే కాదు 225 మంది సభ్యుల కృషి ఉంది
  • మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి

కరీంనగర్: రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతే మనం మళ్లీ బానిసత్వంలోకి పోతామని.. అందుకే రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ ప్రభుత్వాన్ని మార్చాలని మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు పార్లమెంట్కు కూడా లేదు... కేవలం సవరణలు మాత్రమే చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రాయడంలో అంబేద్కర్ ఒక్కరే కాదు 225 మంది సభ్యుల కృషి ఉందని ఆయన వివరించారు. ఆదివారం  సోషల్ డెమెక్రటిక్ ఫోరం నేతలతో కలసి కరీంనగర్ వచ్చారు మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి.

స్థానిక న్యాయవాది కొరివి వేణుగోపాల్ ఇంట్లో భారత రాజ్యాంగానికి పుష్పాభిషేకం చేశారు ఆకునూరి మురళి, సోషల్ డెమెక్రటిక్ ఫోరం నేతలు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  భారత రాజ్యాంగాన్ని మార్చాలన్న కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులను అధ్యయనం చేస్తున్నామని ఆయన తెలిపారు. తెలంగాణ వచ్చాక విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురవుతోందన్నారు. ఎస్సీ, ఎస్టీల కోసమే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో హక్కులిచ్చారన్న అపోహ ఉందన్నారు. 
ఎంపీలు, ఎమ్మెల్యేల్లో రాజ్యాంగంలోని మొదటి పేజీ కూడా చదవని వాళ్లే ఎక్కువ
మన దేశంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల్లో రాజ్యాంగంలోని మొదటి పేజీ కూడా చదవని వాళ్లే ఎక్కువగా ఉన్నారని వారు పేర్కొన్నారు. రాజ్యాంగం వల్లే తనకు పూర్తి హక్కులు లేవని, కిరీటం పెట్టుకునే స్వేచ్ఛ లేదని కేసీఆర్ భావిస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి దేశంలోని ప్రతి పౌరుడు బద్ధులై ఉండాలి... అలా కాకుండా మాట్లాడితే నేరమైన చర్య అవుతుందన్నారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు పార్లమెంట్కు కూడా లేదు. కేవలం సవరణలు మాత్రమే చేయవచ్చని గుర్తు చేశారు. అంబేద్కర్ ఒక్కరే ఇంట్లో కూర్చుని రాజ్యాంగం రాయలేదని, రాజ్యాంగం రాయడంలో అంబేద్కర్ ఒక్కరే కాదు.. 225 మంది సభ్యుల కృషి ఉందని తెలిపారు.  ‘‘రాజ్యాంగ పరిషత్తులోని సభ్యుల ఆలోచనల సమాహారం ఇది.,ఇండియా అనేది ఒక జాతి కాదు. విభిన్న జాతులు, భాషల, సంస్కృతుల సమ్మేళనం.. ఇలాంటి దేశాన్ని కలిపి ఉంచేలా రాజ్యాంగం రాయడమంటే కష్టమైన విషయం.. కానీ ఆ పని మన రాజ్యాంగ నిర్మాతలు చేసి చూపించారు. 
అనేక దేశాల్లో రాజ్యాంగాలు విఫలమై సైనిక పాలనలు వచ్చినా... మన దగ్గర రాలేదు..అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని కేసీఆర్ అనడంలో అర్థం లేదు.. అందరికీ సమాన హక్కులుండాలన్న రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయాలనేది కేసీఆర్ ఆలోచనా? ఆయనది అర్థం లేని వాదన. ఇలాంటి వాదనలు ఇంకా తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనలాంటివాళ్లపై ఉంది. రాజరిక మనస్తత్వానికి ఈ ఆలోచన ప్రతీక. ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలి.,.’’ అని వారు కోరారు. 
కేసీఆర్ రాజ్యాంగ స్ఫూర్తిగా పాలించడం లేదని వారు విమర్శించారు. ‘రాజ్యాంగం అనేది ఓ వాహనం లాంటింది.. దాన్ని డ్రైవ్ చేసే వ్యక్తిపై దాని ప్రయాణ తీరు ఉంటుంది..21వ ఆర్టికల్ కింద ప్రతి ఒక్కరికీ విద్యాహక్కు కల్పించింది రాజ్యాంగం.. ఈ చట్టం ప్రకారం అన్ని స్కూళ్లలో విద్యార్థులకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించాలి.. ఏడున్నర సంవత్సరాల్లో ఎందుకు స్కూళ్లలో మౌళిక వసతులు కల్పించలేదు? అలాంటి నీకు రాజ్యాంగం గురించి మాట్లాడే హక్కు కేసీఆర్ కు లేదు..’ అన్నారు.  స్త్రీ, పురుషులకు సమాన హక్కులుండాలని రాజ్యాంగం చెబితే.. మహిళలకే మంత్రిపదవులీయలేదు కేసీఆర్ అని ఆయన విమర్శించారు. పార్లమెంట్ కు కూడా రాజ్యాంగాన్ని మార్చే హక్కులేదు. అలాంటిది కేసీఆర్ మాట్లాడితే ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. రాజ్యాంగం అంటే ఇంతకాలం ఎవరికీ తెలియకపోయినా.. కేసీఆర్ వల్ల రాజ్యాంగం గొప్పదనాన్ని అందరూ తెలుసుకుంటున్నారు.. ఇందుకోసం కేసీఆర్ కు థ్యాంక్స్ చెప్పాలి.. అన్నారు. 
రాజ్యాంగాన్ని మార్చాలనడం రాజద్రోహం కింద తీసుకోవాలి
కేసీర్ వ్యాఖ్యల వెనుక బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తుల హస్తం ఉంది.. రాజ్యాంగాన్ని మార్చాలనడం రాజద్రోహం కింద తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. భారత రాజ్యాంగం ప్రపంచంలోనే గొప్పది, ఇలాంటి రాజ్యాంగాన్ని మార్చాలనడం దారుణం అన్నారు. రాజ్యాంగం వల్లే తెలంగాణ వచ్చింది, ఆ సోయి కూడా లేకుండా దాన్ని మార్చాలని కేసీఆర్ మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు. రాజ్యాంగం మర్చాలనడానికి కేసీఆర్ కు ఎంత ధైర్యం అని  ప్రశ్నించారు.