
- రెండోసారి నోటీసులు అందజేసిన అధికారులు
శంషాబాద్, వెలుగు : జీవో 111 పరిధిలోని భూముల్లో వెంచర్లు వేసి రోడ్లు నిర్మిస్తున్నారని గ్రామస్తుల ఫిర్యాదుతో మంగళవారం శంషాబాద్ ఎంపీఓ ఉషారెడ్డి, స్థానిక పంచాయతీసెక్రటరీ పరిశీలించి నోటీసులు ఇచ్చారు. శంషాబాద్ మండలం శంకరాపురం పంచాయతీలోని రెవెన్యూ సర్వే నంబర్ 24లో పేద రైతులకు అప్పటి ప్రభుత్వాలు స్థలాలు కేటాయించాయి. జీవో 111 పరిధిలోకి వచ్చే ఆ భూములను కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా కొనుగోలు చేసి బై నంబర్లు వేసి వెంచర్లు నిర్మిస్తున్నారని కొందరు గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదు చేశారు.
దీంత మొదటిసారి వెంచర్ నిర్మాణదారులకు పంచాయతీ సెక్రటరీ నోటీసు జారీ చేశారు. వాటిని పట్టించుకోకుండా.. వెంచర్ లో సీసీ రోడ్డు నిర్మాణాలు, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకులు నిర్మిస్తున్నారని మరో సారి అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో మరోసారి అధికారులు వచ్చి పరిశీలించారు. రెండోసారి నోటీసులు జారీ చేశారు. వెంటనే పనులు ఆపకుంటే కూల్చివేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా నిర్మించే వెంచర్ లో అసైన్డ్ భూమి ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.