బీసీలకు 42% కోటాపై జీవో రిలీజ్.. లోకల్ బాడీ ఎలక్షన్స్‎కు లైన్ క్లియర్

బీసీలకు 42% కోటాపై జీవో రిలీజ్.. లోకల్ బాడీ ఎలక్షన్స్‎కు లైన్ క్లియర్
  • ఆర్టికల్స్​ 243 డీ (6), 243 టీ(6) ప్రకారం రాష్ట్ర సర్కార్​ కీలక ఉత్తర్వులు
  • సామాజిక న్యాయం దిశగా ఇది మరో ముందడుగు
  • ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకే ఈ నిర్ణయం
  • పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు అమలు
  • స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • జీవో నంబర్​ 9ని విడుదల చేసిన బీసీ సంక్షేమ శాఖ 
  • హర్షం వ్యక్తం చేసిన బీసీ సంఘాలు, ప్రతినిధులు

హైదరాబాద్​, వెలుగు: స్థానిక సంస్థల (రూరల్, అర్బన్)​ఎన్నికల్లో బీసీలకు 42 శాతం కోటా కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రిజర్వేషన్లు పెంచుతూ శుక్రవారం బీసీ సంక్షేమ శాఖ నుంచి జీవో నంబర్​ 9ని విడుదల చేయించింది. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్షాలు సహా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుల ఆధారంగా, బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే లక్ష్యంతో ఈ జీవోను వెంటనే అమలులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. అణగారిన వర్గాలు అందరితోపాటు ఎదగాలన్నదే తమ ఉద్దేశమని, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

సామాజిక న్యాయం, బలహీనవర్గాల సాధికారత దిశగా ఇది మరో ముందడుగు అని పేర్కొంది.  స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేయడంతో ఆ ఎన్నికలకు లైన్ ​క్లియర్​అయింది. రాజ్యాంగంలోని 243 డీ (6) ప్రకారం పంచాయతీల్లో, 243 టీ(6) ప్రకారం మున్సిపాలిటీల్లో  బీసీ కోటాపై స్టేట్​గవర్నమెంట్​నిర్ణయం తీసుకోవచ్చని, ఆ మేరకే బీసీ రిజర్వేషన్లను 42శాతానికి పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. 

తెలంగాణలో బీసీల జనాభా, రాజకీయ ప్రాతినిధ్యంలో వారి వెనకబాటుతనాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత, వారి సంక్షేమం, పురోగతి కోసం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయించినట్లు తెలిపింది. నిరుడు ఫిబ్రవరిలో చేపట్టిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల (సీసీఈపీసీ) సర్వేను రిజర్వేషన్ల కోసం పరిగణనలోకి తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

‘‘సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం బీసీల రిజర్వేషన్లను ఖరారు చేసేందుకు అప్పట్లో రిటైర్డ్ ఐఏఎస్​ చైర్మన్‎గా బీసీ డెడికేటెడ్​ కమిషన్‎ను ఏర్పాటు చేశాం. కుల గణన సర్వేలో లభించిన సమగ్ర శాస్త్రీయ డేటాను డెడికేటేడ్​ కమిషన్‎కు అందించి, విశ్లేషించాలని కోరాం. కమిషన్ క్షుణ్ణంగా పరిశోధించి, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల శాతాన్ని నిర్ధారించడానికి అవసరమైన గణాంకాలను, ఇతర ఆధారాలను సమకూర్చింది. 

కులగణన డేటాను విశ్లేషించిన డెడికేటెడ్​ కమిషన్ కొన్ని సిఫార్సులు చేసింది. 56.33 శాతం మంది ఉన్న బీసీ కులాలు జనాభా స్థాయిలో ఎదగలేకపోయారని.. ఈ గ్యాప్​ను పూడ్చడానికి, వెనుకబాటుతనం వాస్తవ స్థితిని పరిగణనలోకి తీసుకుని వారికి రాజకీయంగా, స్థానిక సంస్థల్లో కనీసం 42 శాతం కోటా కల్పించాలని సిఫార్సు చేసింది. ఈ మేరకే  ‘ది తెలంగాణ బ్యాక్​ వర్డ్ క్లాసెస్ (రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఇన్ రూరల్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్) బిల్లు– 2025’ను అసెంబ్లీ, కౌన్సిల్​ రెండు సభలు ఏకగ్రీవంగా ఆమోదించాయి. వాటి ఆధారంగానే ఇప్పుడు ఉత్తర్వులు జారీ చేశాం’’ అని రాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. 

బీసీ డిక్లరేషన్​లో ప్రకటించినట్లుగా..!

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్​ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్​ ప్రకటించింది. ఆ ప్రకటన ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను చట్టపరంగా అమలు చేసేందుకు ముందుకు నడిచింది. బ్రిటిష్​ కాలంలో కులగణన జరుగగా, ఆ తర్వాత మళ్లీ 2024లో ఎలాంటి ఆటంకాలు లేకుండా రాష్ట్రంలో కులగణన చేపట్టారు. 2024  నవంబర్ 6న హౌస్- లిస్టింగ్‎తో ప్రారంభమైన సమగ్ర ఇంటింటి సర్వే దాదాపు 50 రోజుల పాటు జరిగింది. రాష్ట్రంలో దాదాపు 1,03,889 మంది ఎన్యూమరేటర్లు, సూపర్​వైజర్లు ఈ బాధ్యతను నిర్వర్తించారు. 

మొత్తం కోటీ 12 లక్షల 15 వేల 134 కుటుంబాల నుంచి 3 కోట్ల 54 లక్షల 77 వేల 554 మంది వివరాలు సేకరించారు. ఒక్కో కుటుంబం నుంచి కులంతో పాటు విద్య, ఆదాయం, వృత్తి, రాజకీయ భాగస్వామ్యం వంటి 75 కీలక అంశాలపై సమాచారం రికార్డు చేశారు. తొలి దశలో దాదాపు 3.1% మంది జనాభా (సుమారు 16 లక్షల మంది) సర్వేలో పాల్గొనలేకపోయారు. ఇండ్లకు తాళాలు వేసి వెళ్లిన వారు, లేదా వివరాలు ఇవ్వడానికి సుముఖత చూపని వారి కోసం ప్రభుత్వం రీ-సర్వేకు అవకాశం కల్పించింది. 2025  ఫిబ్రవరి 16 నుంచి  28 వరకు రీ-సర్వే చేశారు. సర్వే డేటా నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలుపడమే కాకుండా.. బీసీ డెడికేటెడ్​ కమిషన్ కు బీసీల స్థితిగతులపై విశ్లేషించాలని కోరింది.  

బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్​..!

కులగణన వివరాల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం విద్య, ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రూపొందించిన రెండు వేర్వేరు బిల్లులను ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదించింది. దీని ప్రకారం.. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఈ బిల్లులను గవర్నర్​ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపగా పెండింగ్​పెట్టారు. కానీ, రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డీ(6),  ఆర్టికల్ 243 టీ(6) ప్రకారం పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్ల ఖరారుకు రాష్ట్రానికి ఉన్న అధికారం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లింది.

 గతంలో ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్‎లో ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా అమలు చేసినట్లే.. తాజాగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినట్లు స్పష్టమవుతున్నది. కాగా, బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీచేయడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బీసీ సంఘాల ప్రతినిధులు వేర్వేరు ప్రకటనలో ఆనందం వెలిబుచ్చారు. 

ఆ అధికారంతోనే..

రాజ్యాంగం రాష్ట్రాలకు కల్పించిన అధికారాలతోనే బీసీ రిజర్వేషన్లు పెంచుతూ తాజా ఉత్తర్వులు జారీ చేసినట్లు ప్రభుత్వం స్పష్టంచేసింది. ఆర్టికల్​ 40 ప్రకారం ‘స్థానిక పాలన’ అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని పేర్కొన్నది.  దీంతోపాటు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 డీ(6),  ఆర్టికల్ 243 టీ(6)ను జీవోలో ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇవి వరుసగా పంచాయతీలు, మున్సిపాలిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించినవి. 

ఈ రెండు నిబంధనలు స్థానిక సంస్థల్లో వివిధ వర్గాలకు రిజర్వేషన్లను కల్పించే అధికారాన్ని రాష్ట్ర శాసనసభలకు కల్పిస్తున్నాయి. షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్ ​తెగల (ఎస్టీ)కు మాత్రమే  కాకుండా.. బీసీలకు కూడా రిజర్వేషన్లు కల్పించే అధికారం ఈ ఆర్టికల్స్​ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చింది. ఈ క్రమంలో సామాజిక న్యాయం, సమాన ప్రాతినిధ్యాన్ని పెంపొందించ డానికి.. గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీల వరకు బీసీల రిజర్వేషన్లు పెంచినట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంచేసింది.

ఇది చరిత్రాత్మకమైన నిర్ణయం

బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల అమలుకు జీవో జారీచేయడం హర్షణీయం. బీసీల దీర్ఘకాలిక పోరాటానికి దక్కిన ఫలితం. ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌రెడ్డిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. పేదలకు రాజకీయ ప్రాతినిథ్యం పెరిగి.. సామాజిక, రాజకీయ న్యాయం దక్కుతుంది. ఇది ప్రజాస్వామ్యబద్ధమైన నిర్ణయం గనుక దీనిపై ఎవరూ న్యాయ పోరాటానికి దిగొద్దని నేను కోరుతున్నా. బీసీల కోసం రాష్ట్ర సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని అందరూ అంగీకరించాలి.- ఆర్ కృష్ణయ్య, బీజేపీ ఎంపీ

జీవోను స్వాగతిస్తున్నం 

బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను స్వాగతిస్తున్నాం. ఈ జీవో ప్రకారం ఎన్నికలు జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లీగల్ సమస్యలు వస్తే పరిష్కరించాలి.
- బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్

కాంగ్రెస్​ చిత్తశుద్ధికి నిదర్శనం

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం. బీసీలను రాజకీయ, విద్య, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి చేయాలన్న కాంగ్రెస్​ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనం. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రివర్గం బీసీ రిజర్వేషన్ల అమలు కోసం అహర్నిశలు కృషి చేసింది. బీసీ సమాజం పక్షాన, కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్న.

 రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేసేందుకు కృషి చేసింది. రాజకీయ, సాంకేతిక, న్యాయ పరమైన, రాజ్యాంగ పరమైన అన్ని రకాల చర్యలు తీసుకొని ఇప్పుడు జీవో ఇచ్చింది. అన్ని వర్గాలు సహకరించి రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలి.
‌‌‌‌‌‌‌‌- పీసీసీ చీఫ్​ మహేశ్​ గౌడ్​

బీజేపీ తరఫున సంపూర్ణ మద్దతు

‘‘స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీవో 9ని స్వాగతిస్తున్నం. ఈ విషయంలో బీజేపీ తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నం. బీసీ రిజర్వేషన్లపై జీవో ఇప్పటికే ఆలస్యమైంది. ఈ పని ముందే చేసి ఉంటే బాగుండేది. స్థానిక సంస్థల ఎన్నికలకు మేం సిద్ధంగా ఉన్నం. అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తం.’’
- బీజేపీ స్టేట్​ చీఫ్​ రాంచందర్​రావు

సీఎం రేవంత్​రెడ్డికి ధన్యవాదాలు

సీఎం రేవంత్​రెడ్డికి బీసీ స‌‌‌‌మాజం త‌‌‌‌రఫున ధ‌‌‌‌న్యవాదాలు. బీసీ బిడ్డ కాకపోయినా రాహుల్ గాంధీ మాట కోసం బీసీల‌‌‌‌కు 42 శాతం రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్లు క‌‌‌‌ల్పించారు. బీసీల‌‌‌‌కు విద్య, ఉద్యోగ‌‌‌‌, రాజ‌‌‌‌కీయాల్లో 42 శాతం రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్లు క‌‌‌‌ల్పిస్తూ అసెంబ్లీ బిల్లులను ఆమోదించి కేంద్రానికి పంపినా  పట్టించుకోలేదు. బిల్లుల ఆమోదం కోసం జంత‌‌‌‌ర్ మంత‌‌‌‌ర్ లో ధ‌‌‌‌ర్నా చేశాం.

 బీసీ ప‌‌‌‌క్షపాతిగా రేవంత్ రెడ్డి జీవో తీసుకువ‌‌‌‌చ్చారు. బీసీల‌‌‌‌కు 42 శాతం రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్లు క‌‌‌‌ల్పించే ఎన్నిక‌‌‌‌ల‌‌‌‌కు వెళ్లాల‌‌‌‌ని మా ప్రభుత్వం జీవో జారీ చేసింది. రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్ల కార‌‌‌‌ణంగా స్థానిక సంస్థల్లో బీసీల‌‌‌‌కు అనేక అవ‌‌‌‌కాశాలు రాబోతున్నాయి. బీసీల‌‌‌‌పైన రేవంత్ రెడ్డి అపార ప్రేమ చూపించారు. బీసీల గుండె చ‌‌‌‌ప్పుడును మా సీఎం రేవంత్ రెడ్డి విన్నారు.
- ప్రభుత్వ విప్​ ఆది శ్రీనివాస్​

బీఆర్​ఎస్​, బీజేపీకి బుద్ధిచెప్పాలి

కేంద్రం ప‌‌‌‌ట్టించుకోక‌‌‌‌పోయినా సీఎం రేవంత్ రెడ్డి బీసీల‌‌‌‌కు రిజ‌‌‌‌ర్వేష‌‌‌‌న్లు ఇచ్చి పెద్దన్నగా నిల‌‌‌‌బ‌‌‌‌డ్డారు. బీసీల‌‌‌‌కు రాజ్యాధికారం రావొద్దని బీఆర్ఎస్, బీజేపీ ప్రయ‌‌‌‌త్నం చేశాయి. బీఆర్ఎస్, బీజేపీకి బీసీ బిడ్దలు తగిన బుద్ధిచెప్పాలి. 
- ప్రభుత్వ విప్​ బీర్ల అయిలయ్య