గోవా దీవిలో నేవీని జెండా ఎగరేయొద్దంటారా?.. ఉక్కు పాదంతో అణచివేస్తాం

గోవా దీవిలో నేవీని జెండా ఎగరేయొద్దంటారా?.. ఉక్కు పాదంతో అణచివేస్తాం

పణజీ: ఈ పంద్రాగస్టుతో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతోంది. ఈ సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఘనంగా వేడుకలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగమై దేశ భక్తి ఉప్పొంగేలా వినూత్న కార్యక్రమాలు చేపట్టాలని ఇండియన్ నేవీ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా ఉన్న అనేక దీవుల్లో జాతీయ జెండా ఎగురవేసి.. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌ను విజయవంతం చేయాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గోవాలోని వాస్కో టౌన్ సమీపంలో ఉన్న సవో జసిన్టో దీవిలో జెండా ఎగరేసేందుకు ఏర్పాట్లు చేయడానికి నేవీ టీమ్‌ అక్కడి వెళ్లింది. కానీ అక్కడ దీవిలో ఉండే ప్రజలు కొందరు ఈ కార్యక్రమంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడ జెండా ఎగరేయొద్దని నేవీ టీమ్‌కు చెప్పారు. దీంతో సవో జసిన్టో దీవిలో ఈ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు గోవా నేవల్ బేస్‌లో ఉన్న ఐఎన్‌ఎస్ హన్సా అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. 

గోవా సీఎం సీరియస్ వార్నింగ్

సవో జసిన్టో దీవిలో జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు నేవీ అధికారులు ప్రకటించడంతో గోవా సీఎం ప్రమోద్ సావంత్ స్పందించారు. జాతీయ జెండాను ఎగురవేస్తామంటే, సవో జసిన్టోలో కొందరు వ్యక్తులు వ్యతిరేకించడం చాలా దురదృష్టమని ఆయన అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయకుండా అడ్డుకోవడం సిగ్గుచేటన్నారు. దీనిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని, ఇటువంటి పనులను రాష్ట్ర ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు. నేవీ తమ కార్యక్రమాన్ని ముందుగా ప్లాన్ చేసిన ప్రకారం యథావిధిగా కొనసాగించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. గోవా పోలీసుల నుంచి పూర్తి సహకారం అందిస్తామని సీఎం ప్రమోద్ సావంత్ తెలిపారు. దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడేవారిని ఉక్కు పాదంతో అణచివేస్తామని హెచ్చరించారు.