35 ఏండ్ల తర్వాత ప్రేమకు గ్రీన్ సిగ్నల్

V6 Velugu Posted on Dec 03, 2021

స్వర్గంలో పెళ్లిళ్లు నిశ్చయించబడతాయని అంటారు. దానికి నిదర్శనంగా ఓ వృద్ధ జంట లేటు వయసులో ఒక్కటయింది. ప్రేమకు అడ్డేది ఉండదని నిరూపించారు. 35 ఏండ్ల తర్వాత వారిద్దరూ ఏకమయ్యారు. ఈ ఓల్డ్ ఏజ్ మ్యారెజ్ కర్నాటకలో వెలుగుచూసింది.

పూర్తి వివరాలు తెలియాలంటే.. 35 సంవత్సరాల వెనుకకు వెళ్లాలి. మైసూర్ కు సమీపంలోని హెబ్బల్ ప్రాంతానికి చెందిన చిక్కన్న.. అదే ప్రాంతానికి చెందిన జయమ్మను ప్రేమించాడు. ఈ విషయాన్ని ఆమెకు చెబితే జయమ్మ తిరస్కరించింది. కొంతకాలానికి జయమ్మకు మరో వ్యక్తితో పెళ్లి జరిగింది. తాను ప్రేమించిన అమ్మాయి దూరం కావడంతో.. తీవ్ర మనోవేదనకు గురైన చిక్కన్న.. జీవితంలో పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకున్నాడు. స్వస్థలంలో ఉంటే జయమ్మ గుర్తులు వెంటాడతాయని భావించిన చిక్కన్న.. ఊరు వదిలి వెళ్లిపోయాడు. కాగా.. జయమ్మకు విధి రాత బాలేక.. పెళ్లైన కొంతకాలానికి ఆమె భర్త చనిపోయాడు. దాంతో ఆమె మళ్లీ ఒంటరిదై.. తన చుట్టాల ఇళ్లలో ఉంటూ జీవితం వెళ్లదీస్తోంది.

ఈ మధ్యే జయమ్మ గురించి తెలుసుకున్న చిక్కన్న.. తిరిగి సోంతూరుకు వచ్చాడు. జయమ్మను మరచిపోలేక ఏకాకిగా ఉన్న చిక్కన్న.. 65 ఏండ్ల వయసులో మరోసారి ఆమెకు తన ప్రేమను తెలియజేశాడు. తనకు పెళ్లి అయినప్పటినుంచి చిక్కన్న ఒంటరిగానే ఉంటున్నాడని తెలుసుకున్న జయమ్మ.. ఆయన ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో 35 ఏండ్ల కిందట ఆగిపోయిన తన ప్రేమను చిక్కన్న తిరిగి దక్కించుకున్నాడు. కుటుంబసభ్యుల సమక్షంలో ఇరువురు మేలుకోటే చెలువనారాయణ ఆలయంలో డిసెంబర్ 2న ఒక్కటయ్యారు. స్వచ్ఛమైన మనసుతో ప్రేమిస్తే.. ఎంత కష్టమైనా, ఎంత కాలానికైనా ప్రేమను గెలుచుకోవచ్చని చిక్కన్న నిరూపించాడు.   

Tagged Love Marriage, karnataka, love, hebbal, chikkanna, jayamma, late age marriage, melukote

Latest Videos

Subscribe Now

More News